2022లో వచ్చిన ‘ఒకే ఒక జీవితం’ తర్వాత శర్వానంద్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. గత ఏడాది జూన్లో ఆయన వివాహం జరిగింది. ఈ విరామానికి ఆ వివాహం కూడా ఓ కారణం కావొచ్చు. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యే పనిలో ఉన్నారాయన. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న శర్వా.. ‘సామజవరగమనా’ చిత్ర దర్శకుడు రామ్ అబ్బరాజు కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
వచ్చే నెలలోనే ఈ చిత్రం షూటింగ్ కూడా మొదలుకానుందని తెలిసింది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన ‘సామజవరగమనా’ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. గత ఏడాది అద్భుత విజయాల్లో ఆ సినిమా ఒకటి. శర్వాతో చేయనున్న కథ కూడా ప్రేమ, భావోద్వేగాల సమ్మేళనంగా ఉంటుందని సమాచారం. అలాగే రామ్ అబ్బరాజు మార్క్ హ్యూమర్ కూడా ఇందులో ఉంటుందని వినికిడి. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సివుంది.