Sharukh Khan | బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ మరోసారి మంచి వ్యక్తిత్వంతో అభిమానులను ఆకట్టుకున్నారు. తెరపై ‘కింగ్’గా పేరు సంపాదించుకున్న ఆయన, నిజజీవితంలోనూ అదే స్థాయిలో ప్రవర్తిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘కింగ్’ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ఒక చిన్న సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రెండోసారి గర్భవతి అయిన దీపికా పదుకొణే మెట్లు ఎక్కుతున్నప్పుడు షారూఖ్… ఆమెని జాగ్రత్తగా నడిపించిన దృశ్యం నెటిజన్ల మనసులను దోచుకుంది. నలుపు దుస్తుల్లో కనిపించిన షారుఖ్, తన కో-స్టార్ పట్ల చూపిన ఆప్యాయత ఆయనలోని జెంటిల్మన్ స్వభావాన్ని మరోసారి బయటపెట్టింది.
ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “అందుకే ఆయన కింగ్ ఖాన్ అయ్యారు” అని ఒకరు కామెంట్ చేయగా, “ఇదే నిజమైన గ్రీన్ ఫ్లాగ్ మేన్” అంటూ మరికొందరు స్పందిస్తున్నారు. గతంలో ఈ జంట కలిసి నటించిన ఓం శాంతి ఓం. చెన్నై ఎక్స్ ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్ సినిమాల జ్ఞాపకాలను కూడా అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఇక ‘కింగ్’ సినిమా షూటింగ్ నుంచి లీక్ అవుతున్న ఫోటోలు, వీడియోలపై దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఈ లీకులు వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో, “దయచేసి లీక్ అయిన కంటెంట్‌ను షేర్ చేయొద్దు. మేము మీకు అద్భుతమైన సినిమా అనుభూతిని అందించేందుకు శ్రమిస్తున్నాం. పెద్ద తెరపై వచ్చే సర్ప్రైజ్ కోసం వేచి చూడండి” అని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కింగ్’లో షారూఖ్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తుండగా, అభిషేక్ బచ్చన్, రాణీ ముఖర్జీ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ మరియు మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో షారుఖ్ అండర్వర్ల్డ్ డాన్‌గా, సుహానా ఆయన శిష్యురాలిగా కనిపించనున్నట్లు సమాచారం.2023లో పఠాన్, జవాన్ సినిమాలతో భారీ విజయాలు సాధించిన షారూఖ్ ఖాన్ ఇప్పుడు ‘కింగ్’ కోసం కఠినంగా శ్రమిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.