Shyam Singha Roy Hindi remake | నాచ్యురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియస్లు హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైనమెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించాడు. గతేడాది క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించింది. నాని ద్విపాత్రాభినయంగా నటించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన మొదటివారంలో ఎక్కువమంది వీక్షించిన మొట్ట మొదటి ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. మొదట ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా డబ్ చేయాలని దర్శక నిర్మాతలు భావించారు. కానీ డబ్ చేయడం కంటే ఈ కథను హిందీలో రీమేక్ చేస్తే బాగుంటుందని మేకర్స్ అభిప్రాయానికి వచ్చారు.
ఈ చిత్ర హిందీ రీమేక్ రైట్స్ కోసం పలు బాలీవుడ్ నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపించారట. ఇక ఈ చర్చలు తుది దశకు వచ్చాయిని తెలుస్తుంది. హిందీలో ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు తెరకెక్కించనున్నాడట. ఈ రీమేక్‌లో నటించేందుకు ఇద్దరు స్టార్ హీరోలు ఆసక్తి చూపుతున్నారట. ఈ చిత్ర రీమేక్ కోసం షాహిద్ కపూర్, అజయ్ దేవగణ్ పోటి పడుతున్నారని సమాచారం. ఇక జెర్సీ రీమేక్‌లో షాహిద్ కపూర్ నటించడంతో శ్యామ్ సింగ రాయ్ చిత్రంలో షాహిద్ నటిస్తే బాగుంటుందని పలువురు నిర్మాతలు భావిస్తున్నారట. పూర్వ జన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ,కన్నడ, మలయళ భాషల్లో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.