పాత్రలో హీరో కనిపించడం సాధారణమే! పాత్ర ఆ హీరోను మరిపిస్తే అద్భుతం!! బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడంలో నటులకు కిక్కు ఉండదు! హీరోయిజాన్ని తలదన్నే ‘నట’నిజాన్ని ప్రేక్షకులకు చూపించినప్పుడే వాళ్లు తృప్తి చెందుతారు. ఒక యాక్టర్ తన కెరీర్లో ఇలా సంతృప్తిపడే సందర్భాలు అరుదుగా ఉంటాయి.కమర్షియల్ ఈక్వేషన్లో ఇమడకపోయినా, బాక్సాఫీస్ దగ్గరబోల్తాపడ్డా.. ఓ సరైన చిత్రం ఆ నటుణ్ని నిఖార్సైన హీరోగా నిరూపిస్తుంది. అందులోని పాత్ర ద్వారా ఆ నటుడిపై ఉన్న గౌరవమూ అమాంతం పెరుగుతుంది.
ఓ బాటసారి..
బాలీవుడ్లో మెథడ్ యాక్టింగ్‌కు దిలీప్‌కుమార్ పెట్టింది పేరు. తెలుగులో ఆ ఫార్ములాకు కాస్త దగ్గరగా ఉన్న సినిమాలు అక్కినేని నాగేశ్వరరావు ప్రయత్నించాడు. అందులో ఒకటి ‘బాటసారి’. బెంగాలీ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఏయన్నార్ నటన దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ గుర్తుంటుంది. ఇదే చిత్రంలో భానుమతి పాత్ర అద్భుతంగా పండినా.. అజరామరంగా నిలిచింది మాత్రం హీరో పాత్రే! ‘మీకు నచ్చిన పాత్రలు ఏమిటి?’ అని ఏయన్నార్‌ను ఎవరైనా అడిగినప్పుడు.. ఆయన చెప్పే లిస్ట్‌లో బాటసారిలో ‘సురేంద్రనాథ్’ పేరు తప్పకుండా ఉండేది. ఏయన్నార్‌ను ‘బాటసారి’ స్థాయి రేంజ్లో గుర్తుపెట్టుకునేలా చేసిన మరోపాత్ర ‘భక్త తుకారాం’లో కనిపిస్తుంది.
కొత్త తలైవా
‘జైలర్’ సినిమా రిలీజైనప్పటి నుంచి.. అంతటా ఒకటే మాట! రజనీ అద్భుతం చేశాడు!! తలైవా ఇరగదీశాడు!! సూపర్‌స్టార్‌ను కమర్షియల్ ఈక్వేషన్స్‌తో సంబంధం లేకుండా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కొత్తగా చూపించాడు. రజనీ మేనరిజమ్స్ కన్నా.. టైమింగ్‌ను డైరెక్టర్ బాగా పట్టుకున్నాడు అని దర్శకుడిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు! రజనీ ఆహార్యం సహజత్వానికి దగ్గరగా ఉండటం, పాత్రోచితంగా పరిధి మేరకు పెర్ఫార్మెన్స్ చేయడం అభిమానులకు కన్నులవిందు చేసింది. అందుకే జైలర్ రికార్డు కలెక్షన్లు వసూలు చేస్తున్నది. నటనకు పర్యాయపదం రజనీకాంత్. యూనివర్సల్ స్టార్‌గా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే కొన్నేండ్లుగా ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ రేసులో వెనకబడ్డవే! ‘కబాలి’, ‘కాలా’ చిత్రాలు ప్రయోగాత్మకంగా అనిపించినా రజనీ స్టార్
డమ్‌ను మించిన పేరును ఆయనకు తెచ్చిపెట్టింది లేదు. తాజాగా విడుదలైన ‘జైలర్’ పాజిటివ్ టాక్‌తో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తున్నది. వసూళ్లు సాధిస్తూనే నటుడిగా రజనీ రేంజ్ ఇది అని నిరూపించింది. సహజంగా కనిపించాడనీ, టైమింగ్ అదిరిందని అందరూ అంటున్నారు. చాలారోజులుగా మూస ధోరణిలో కొట్టుమిట్టాడిన తలైవాను కొత్తగా చూపించడంతో ఈ రోజుల్లోనూ ‘జై.. జైలర్’ అంటూ రిపీట్ ఆడియెన్స్ థియేటర్లకు వస్తున్నారు.
నలుగురు మెచ్చేలా..
నవ్వుల హీరో రాజేంద్రప్రసాద్. ఆయన జంధ్యాల స్కూల్లో పగలబడి నవ్వించాడు. రేలంగి నరసింహారావు చిత్రాల్లో కడుపుబ్బా నవ్వించాడు. దర్శకుడు ఎవరైనా కామెడీపై కమాండ్ తగ్గేది కాదు! సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎన్నో విన్నింగ్ షాట్లు కొట్టిన ఈ సీనియర్ నటుడిని ‘ఆ నలుగురు’ మరింత సిన్సియర్‌గా అభిమానించేలా చేసింది. డబ్బు ముసురుకున్న మానవ బంధాలు ఎంతగా కొడిగడుతున్నాయో చూపింది. చివరికి మానవత్వాన్ని, అభిమానాన్ని చాటేది ఆ నలుగురే అని గుర్తుచేసింది. ఈ సినిమాతో రాజేంద్రప్రసాద్ కెరీర్ మరోసారి ఊపందుకుంది. 2004లో విడుదలైన ఈ చిత్రం అప్పటివరకు మనకు గుర్తున్న ఈ నవ్వుల హీరోను మరోకోణంలో ఆవిష్కరించింది. వెండితెరపై ఒకప్పటి ఈ ‘అప్పుల అప్పారావు’ను తలుచుకున్నప్పుడల్లా ‘ఆ నలుగురు’ రఘురామయ్య గుర్తొస్తాడు.
వీళ్లకూ ఉన్నాయ్
అభిమానుల విపరీత ఆరాధన హీరోలను ప్రయోగాత్మక చిత్రాలకు దూరంగా ఉంచుతుంటుంది. వారిని మెప్పించాలనే నియమాన్ని కాసేపు పక్కనపెడితే.. ప్రతి కథానాయకుడి మూవీలిస్ట్లో అద్భుతమైన చిత్రాలు వచ్చిచేరుతాయి. మెగాస్టార్ చిరంజీవికి ‘స్వయంకృషి’, ‘రుద్రవీణ’ చిత్రాలు విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘అన్నమయ్య’ నాగార్జునకు అఖండమైన ఖ్యాతిని తెచ్చిపెట్టింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఇద్దరు’ మోహన్‌లాల్‌లోని విలక్షణ నటుణ్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. తమిళ నటుడు శరత్‌కుమార్ అకౌంట్లో ఇటీవల సూపర్హిట్లు వచ్చి చేరుతున్నాయి. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చారిత్రక చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’లో కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. తన అనుభవాన్నంతా రంగరించి పలువెట్టరాయ పాత్రకు ప్రాణం పోశారు. ఇదే జోరులో కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న ‘పోర్ తొళిల్’ సినిమాలో క్రైం బ్రాంచ్ ఎస్పీ లోక్నాథన్గా ఆయన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖంలో హావభావాలు, మాటలో గాంభీర్యం శరత్‌కుమార్ విలక్షణతను మరోసారి చాటిచెప్పాయి.
దెబ్బతిన్నవీ అనేకం
హీరో ఇమేజ్ను దెబ్బతీసిన చిత్రాలూ ఉన్నాయి. బిగ్ బి అమితాబ్ సెకండ్ ఇన్నింగ్స్ మొదట్లో పలు చిత్రాలు ఆయనకు పేరు తీసుకురాకపోగా, కీర్తిని మసకబారేలా చేశాయి. 2003లో విడుదలైన ‘బూమ్’ చిత్రంలో అమితాబ్ పాత్రను చూసి ఆయన అభిమానులు సైతం పెదవి విరిచారు. చిరంజీవి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లు కోకొల్లలు. భారీ పరాజయాలూ కొన్ని ఉన్నాయి. సగటు అభిమానికి మాత్రం ఈ మెగాహీరో నటించిన ‘బిగ్‌బాస్’, ‘డాడీ’ చిత్రాలు అస్సలు రుచించవు. తాజాగా ‘భోళా శంకర్’ సినిమా సైతం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇమేజ్ చట్రం చాలా విచిత్రమైనది. ఇందులో పూర్తిగా ఇమిడిపోతే అభిమానుల అంచనాలు అందుకోవడమే పరమావధిగా మారిపోతుంది. పూర్తిగా దూరంగా ఉన్నా.. ప్రేక్షకులను రంజింపజేయలేం. ఇమేజ్ను బ్యాలెన్స్ చేస్తూ, విభిన్న కథలు ఎంచుకోగలిగితే.. ఆ సినిమాలు హీరోలకు అదనపు పేరును కట్టబెడతాయి అనడంలో సందేహం లేదు!
స్వాతిశయం..
‘వాడు పసివాడు కాదు శారదా..వామనావతారంలోవచ్చిన విష్ణుమూర్తి..’ 1992లో విడుదలైన స్వాతి కిరణం చిత్రంలో క్లయిమాక్స్‌కు ముందు సీన్లో మలయాళ నటుడు మమ్ముట్టి పలికిన డైలాగ్ ఇది. అప్పటికే తెలుగువారికి మమ్ముట్టి పరిచితుడే! ఆ సినిమాతో అనంతరామ శర్మగా మరింత దగ్గరయ్యాడు. ఇప్పటికీ నలుగురు వ్యక్తుల మధ్య మమ్ముట్టి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ‘స్వాతికిరణం’ పాత్ర తళుక్కున మెరుస్తుంది. కళాతపస్వి విశ్వనాథ్ చిత్రాల్లో కథే హీరో! ఆ కథకు కచ్చితమైన కథానాయకుడు కుదిరితే.. అది ‘స్వాతిముత్యం’లా స్వచ్ఛంగా, ‘శంకరాభరణం’లా హృద్యంగా తెరకెక్కుతుంది. గమకాల తపస్సులో ఆఖరి శ్రుతి అందుకున్నట్టుగా అర్ధనిమీలిత నేత్రాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన అనంతరామ శర్మ, కంటనే అసూయాద్వేషాలను సునాయాసంగా చూపించి ఆశ్చర్యపరిచారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ చిత్రంలోనూ మమ్ముట్టి నటన.. ఈ హీరోను మరింత అభిమానించేలా చేసింది.