‘సీతా రామం’ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తున్నది మృణాల్ ఠాకూర్. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మృణాల్ ఠాకూర్ పాత్రికేయులతో మాట్లాడుతూ ‘దాదాపు పన్నెండేళ్ల క్రితం అసిస్టెంట్ దర్శకురాలిగా నా ప్రయాణాన్ని మొదలుపెట్టా. నేడు వైజయంతీ మూవీస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించిన సినిమాలో భాగం కావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. ‘సీతా రామం’ చిత్రంలో నేను సీతామహాలక్ష్మి పాత్రలో కనిపిస్తా. నా పాత్రను తీర్చిదిద్దిన విధానం, కథానాయకుడు రామ్‌తో ఆమె ప్రణయగాథ హృద్యంగా అనిపించింది. మనందరికి తప్పకుండా ఓ ప్రేమకథ ఉండి తీరుతుంది. ఆ జ్ఞాపకాల్ని గుర్తుకుతెచ్చేలా ఓ నాస్టాల్జిక్ జర్నీలా ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమాలో కథక్ వంటి నృత్యాల్ని చేయడం మరచిపోలేని అనుభూతిని మిగిల్చింది. గత దశాబ్దకాలంలో తెలుగులో ఈ తరహా ప్రేమకథ రాలేదని నమ్మకంగా చెప్పగలను. ఉత్తరాల నేపథ్యంలో కథను నడిపించడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. రాబోవు రెండు రోజుల్లో నా బర్త్‌డే జరుపుకోబోతున్నా. నా ఫ్రెండ్స్, అభిమానులు చాలా మంది పూర్వపు రోజుల్ని గుర్తుకుతెస్తూ ఉత్తరాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం ఆనందంగా ఉంది. ఇక వ్యక్తిగత విషయాలకొస్తే..ప్రస్తుతం నేను సింగిల్‌గానే ఉన్నా. ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే నాకు ప్రేమలేఖలు పంపించవొచ్చు(నవ్వుతూ)’అని చెప్పింది.