నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా రూపొందిన స్పై డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’. ఈ చిత్రానికి అక్కి విశ్వనాథ్‌రెడ్డి దర్శకుడు. ఈ నెల 18న విడుదల కానున్నది. శనివారం హీరోలు నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడారు. ‘ముందు ఈ సినిమాకు మేం అనుకున్న పేరు ‘చైనా పీస్’. ఆ పేరుతోనే ప్రమోషన్స్ కూడా చేశాం. కానీ ఆ టైటిల్ విషయంలో సెన్సార్ నుంచి అభ్యంతరాలు వచ్చాయి. అందుకని ఆ టైటిల్‌ని తొలగించి, కథకు అనుగుణంగా ‘సీక్రెట్ సోల్జర్’ అనే పేరు ఖరారు చేశాం’ అని తెలిపారు సూర్య, నిహాల్.
ఇంకా చెబుతూ ‘ఇందులో యాక్షన్ కూడా రియలిస్టిక్‌గా ఉంటుంది. మన దేశానికి చెందిన ఓ కీలక సమాచారం లీక్ అవుతుంది. దానికీ, నెల్లూరులో బతికే ఇద్దరు సాదాసీదా యువకులకు సంబంధం ఏంటన్నది ఈ కథలో ఆసక్తికరమైన పాయింట్. ప్రథమార్ధం అంతా స్నేహం, దేశభక్తికి చెందిన ఎమోషన్స్ ఉంటాయి. ద్వితాయార్ధం వినోదంతో కూడిన మలుపులతో ఆసక్తిగా సాగుతుంది’ అని చెప్పారు నిహాల్, సూర్య.