‘నేను ప్రతీ సినిమాకూ ఇంతే కష్టపడ్డాను. కానీ చాలావరకూ నిరాశే ఎదురైంది. సక్సెస్ అనేది నాకు నిజంగా కొత్తే. ‘రావు బహదూర్’తో నాకు సక్సెస్ వచ్చిందని వింటుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా చేస్తున్నప్పుడే ఇలాంటి సినిమా ఆడాలని గట్టిగా కోరుకున్నాను. నా కోరిక నిజమైంది. అమెరికన్స్ సైతం ఈ సినిమా గురించి అడుగుతున్నారు. ఇంతటి మంచి విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అని హీరో సత్యదేవ్ అన్నారు.
ఆయన కథానాయకుడిగా రూపొందిన సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’. వెంకటేశ్ మహా దర్శకుడు. చింతా గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్‌రెడ్డి, శరత్చంద్ర నిర్మాతలు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, నమ్రత శిరోద్కర్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం జూలై 3న విడుదలై థియేటర్లలో ప్రదర్శితమవుతున్నది.
ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో హీరో సత్యదేవ్ మాట్లాడారు. టీమ్ అంతా ఈ కథను నమ్మి పనిచేసిందని, మేం నమ్మి వేసిన ప్రతి అడుగూ విజయ తీరానికి చేర్చిందని, ఫిల్మ్ మేకింగ్‌లో ఉన్నన్నినాళ్లూ సత్యదేవ్‌తో సినిమాలు చేయాలని ఆశిస్తున్నానని దర్శకుడు వెంకటేశ్ మహా పేర్కొన్నారు. ఇంకా నిర్మాతలు చింతా గోపాలకృష్ణారెడ్డి, రాజశేఖర్, శరత్చంద్ర, అనురాగ్‌రెడ్డి, నటి దీపా థామస్, మధు శాలిని కూడా మాట్లాడారు.