Samantha | స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అందం, అభినయంతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా నిలిచింది. సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ సామ్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక సామ్.. గత కొన్ని రోజులుగా మయోసైటిస్ (Myositis)తో బాధపడుతున్న విషయం తెలిసిందే. దాన్నుంచి పూర్తిగా కోలుకునేందుకు సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది. ప్రస్తుతం తన ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెట్టింది. అనారోగ్య సమస్యల గురించి అందరికీ అవగాహన కల్పించేందుకు ఒక పాడ్ కాస్ట్ కూడా ప్రారంభించింది. అందులో ఆరోగ్యంతోపాటు తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా షేర్ చేసుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా తన అభిమానుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడం చిన్న విషయం కాదని చెప్పుకొచ్చింది. తన మాటను గౌరవించే అభిమానులు ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది. ఇక తన అభిమానుల్లో చాలామందికి వినోదం, ఫ్యాషన్, మేకప్‌పై ఆసక్తి ఎక్కువ ఉంటుందని పేర్కొంది. వారిని చూసి ఎన్నో విషయాలపై తన అభిప్రాయాన్ని మార్చుకున్నానని, కొత్త అంశాలపై అవగాహన వచ్చినట్లు తెలిపింది. తన మాటలు కొద్దిమందిపై ప్రభావం చూపినా తనకు ఆనందమేనని పేర్కొంది. వీటి ద్వారా కొంతమందిలో అయినా మార్పు తీసుకురాగలిగితే అంతకు మించి తానేం కోరుకోను అంటూ చెప్పుకొచ్చింది.
ఇక తన మనసుకు నచ్చిందే చేస్తానని సమంత ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఏ నిర్ణయం తీసుకున్నా అది సరైనదా.. కాదా, అని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తానని తెలిపింది. మానసికంగా ప్రశాంతంగా లేకపోతే శారీరకంగా కూడా ఫిట్‌గా ఉండలేదని పేర్కొంది. అందుకే తానెప్పుడూ మెంటల్ హెల్త్‌కు ప్రాధాన్యతనిస్తానని వెల్లడించింది. అందుకోసం అవసరమైన వ్యాయామాలు కూడా చేస్తుంటానని వివరించింది.
Also Read..
Miss Universe | చరిత్రలో తొలిసారి.. అందాల పోటీల్లో 60 ఏళ్ల భామకు కిరీటం
Robert Vadra | నేను రాజకీయాల్లోకి రావాలని దేశమంతా కోరుకుంటోంది.. రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు
Red Sea | ఎర్ర సముద్రంలో చమురు ట్యాంకర్ నౌకపై హౌతీల దాడి