టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మలు బాలీవుడ్లో ఛాన్స్ వస్తే ఒక్క క్షణం ఆలోచించకుండా జంప్ అవుతున్నారు. ఇప్పటికే పూజా హెగ్డే,రష్మిక మందాన, తమన్నాతో పాటు పలువురు అందాల భామలు బాలీవుడ్లో అదృష్టం పరీక్షించుకున్నారు. కొద్ది రోజులుగా సమంత కూడా బాలీవుడ్ సినిమాలు చేస్తుందనే ప్రచారం నడుస్తుంది. అందుకు ఈ అమ్మడు ముంబైలో కాస్ట్లీ ఫ్లాట్ కొనుగోలు చేసినట్టు వార్తలు వచ్చాయి.
ఫ్యామిలీ మేన్ సీజన్-2లో మహిళా కమాండో పాత్ర చేసిన సమంత దేశ వ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో సామ్‌కు హిందీలోను అవకాశాలు వస్తున్నట్టు ఆఫర్స్ రాగా, దానిపై తాజాగా స్పందించింది. “వెబ్ సిరీస్ రూపంలో బాలీవుడ్ నాకు చాలా పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. అన్ని భాషలలో నటించేందుకు నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. ఏ భాషలోనైనా మంచి స్క్రిప్ట్ ను వెదికి పట్టుకోవడమే నా ఎజెండా. ఏ నిర్ణయమైనా మనస్ఫూర్తిగా తీసుకుంటాను.”
బాలీవుడ్ లో మంచి ఆఫర్ వచ్చినప్పటికీ, హైదరాబాద్ నుంచి మకాం మార్చే ఉద్దేశం లేదంటున్న సమంత.. కొత్త రోల్స్ కోసం వెయిటింగ్ అంటూ ప్రకటించింది. “హైదరాబాద్ నాకు చాలా ఇచ్చింది. ఇప్పటికిప్పుడు హైదరాబాద్ వదిలి ముంబయిలో మకాం పెట్టాలని అనుకోవడం లేదు. మనం ఎక్కడున్నాం అనేది ముఖ్యం కాదు, ఇంతకుముందు చేయని పాత్రలు పోషించామా లేదా అనేది ముఖ్యం. చేసినవే మళ్లీ చేస్తే ఆడియన్స్‌కి బోర్ కొడుతుందని పేర్కొంది సామ్.