Samanth | స్టార్ హీరోయిన్ సమంత అరుదైన వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. తాను ‘మయోసైటిస్’ అనే అరుదైన వ్యాధికి చికిత్స తీసుకుంటున్నట్లు ఆమె ఇటీవల సామాజికమాధ్యమాల ద్వారా వెల్లడించింది. కొద్ది నెలల క్రితం తనకు ఈ వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించినట్లు చెప్పుకొచ్చింది. ఒకవైపు చికిత్స తీసుకుంటూనే తన కొత్త సినిమాకు డబ్బింగ్ చెబుతున్న ఫొటోను సైతం షేర్ చేసి అందరినీ షాక్‌కు గురి చేసింది. కాగా, తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మయోసైటిస్ వ్యాధి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురైంది.
‘నేను గత కొన్ని రోజులుగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నా. ప్రస్తుతం నాకు ప్రాణాపాయం లేదు. నేను దీనిపై పోరాటం చేయాలి. ఒక్కోసారి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమో అనిపిస్తుంది. ఒక్కోసారి ఇంత దాటి వచ్చానా అనిపిస్తుంది. కొన్ని మంచిరోజులు ఉంటాయి.. కొన్ని చెడ్డ రోజులు ఉంటాయి. ఇలా పోరాటం చేస్తున్నది నేను ఒక్కదాన్నే కాదు. నాలా చాలా మంది పోరాటం చేస్తున్నారు. ఈ వ్యాధిపై నేను పోరాటం చేస్తా.. చివరకు గెలుస్తానన్న నమ్మకం నాకు ఉంది’ అంటూ సమంత తన ఆరోగ్య పరిస్థితి గురించి చెబుతూ భావోద్వేగానికి లోనయ్యింది.
సమంత లీడ్ రోల్ పోషిస్తున్న చిత్రం యశోద. హరి-హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా కథాంశంతో యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రావు రమేశ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వస్తున్న యశోదను శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.