Sai Pallavi | తొలిప్రేమ జ్ఞాపకాల్ని ఎప్పటికీ మరచిపోలేము. నునులేత ప్రాయంలో కలిగే తెలియని ఆకర్షణ కూడా ప్రేమ భావనగా మదిలో నిక్షిప్తమైపోతుంది. తన జీవితంలో కూడా అలాంటి అనుభవం ఉందని చెప్పింది కథానాయిక సాయిపల్లవి. ఏడో తరగతిలోనే తన క్లాస్మేట్ అయిన ఓ అబ్బాయిపై ఈ అమ్మడు ఇష్టాన్ని పెంచుకుందట. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి ఈ విషయాన్ని వెల్లడించింది.
ఆమె మాట్లాడుతూ ‘నా ప్రేమను వ్యక్తం చేస్తూ ఆ అబ్బాయికి లవ్‌లెటర్ రాశాను. అయితే దానిని అతడికి ఎలా చేరవేయాలో తెలియక పుస్తకంలో దాచిపెట్టా. అది కాస్త మా అమ్మ కంట పడటంతో నన్ను తీవ్రంగా మందలించింది. ఇక అలాంటి పని చేయనని అమ్మకు మాటిచ్చాను. ఆ సంఘటన తర్వాత అమ్మను బాధపెట్టే పని ఏనాడు చేయలేదు. పిల్లలను సన్మార్గంలో నడిపించే ప్రతి తల్లిని నేను ఆదర్శంగా తీసుకుంటాను’ అని చెప్పింది.