Sai Dharam Tej | యువ హీరో సాయిధరమ్‌తేజ్ పేరు మార్చుకున్నారు. తన మాతృమూర్తి దుర్గ పేరును తన పేరుకు జత చేసి సాయి దుర్గ తేజ్‌గా పెట్టుకున్నట్లు తెలిపారు. అమ్మ ఎప్పటికీ తనతోనే ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ షార్ట్ ఫిల్మ్ ‘సత్య’ ప్రత్యేక షోలో సాయి దుర్గ తేజ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
సాయి దుర్గ తేజ్, కలర్స్ స్వాతి నటించిన ఈ షార్ట్ ఫిల్మ్‌ను దిల్‌రాజు ప్రొడక్షన్స్, విజయ్ దుర్గ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలు. నవీన్ విజయ కృష్ణ దర్శకుడు. ఈ సందర్భంగా సాయిదుర్గతేజ్ మాట్లాడుతూ ‘అమ్మ పేరు మీద విజయ దుర్గ ప్రొడక్షన్స్‌ను ప్రారంభించి దిల్‌రాజు ప్రొడక్షన్స్‌తో ఈ సినిమా నిర్మించాను’ అన్నారు. సైనికుల త్యాగాలకు నివాళిగా ఈ లఘు చిత్రాన్ని నిర్మించామని, ఇప్పటివరకు 25 ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చాయని నిర్మాత హర్షిత్ రెడ్డి తెలిపారు.