దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ పై మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ లో కూడా విశేషమైన అంచనాలు ఉన్నాయి. బాహుబలి సినిమాల తరువాత రాజమౌళి తీస్తున్న సినిమా కావడంతో పాటు తొలిసారిగా ఎన్టీఆర్, చరణ్ కలిసి నటిస్తుండడం ఈ సినిమాకి ఇంత భారీ హైప్ రావడానికి కారణం.
జనవరి 7న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రం నుండి పోస్టర్స్, వీడియోలు విడుదల చేయగా వాటికి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త అందరిలో ఆసక్తి కలిగిస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10000 స్క్రీన్లలో విడుదల అవుతుందని తెలుస్తోంది. ఇదే జరిగితే ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో బిగ్గెస్ట్ రిలీజ్ అవుతుంది.
ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని విదేశాలలో కూడా భారీగా విడుదల చేయబోతున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అజయ్ దేవగన్, సముద్ర ఖని ,శ్రియా,రాహుల్ రామకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు.