Romancham Movie On OTT | కొన్ని సినిమాలు ఎవరూ ఊహించని రేంజ్లో కలెక్షన్లు సాధిస్తుంటాయి. పేరున్న దర్శకుడు, స్టార్ కాస్ట్, పెద్ద ప్రొడక్షన్ సంస్థ ఇవేమి లేకుండా కేవలం కంటెంట్‌తో వచ్చి కనకవర్షాలు కురిపిస్తుంటాయి. బహుశా ఆ సినిమాకు పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ కూడా అంత పెద్ద విజయం సాధిస్తుందని ఎక్సపెక్ట్చేయరు. ప్రస్తుతం అదే తరహా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ‘రొమంచన్’ చిత్రయూనిట్. మలయాళంలో నెల రోజుల కిందట ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజైన ఈ సినిమా అక్కడి బాక్సాఫీస్‌పై సంచలనాలు సృష్టించింది.
కేవలం రెండు కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.55 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసి మలయాళ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఈ సినిమాలో షౌబిన్ షాబిర్ తప్పతే పెద్దగా పేరున్న నటుడే లేదు. ఇక దర్శకుడిగా జీతూ మాధవన్‌కు ఇది తొలిచిత్రం. హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా 2007 బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. ఏడుగురు బ్రహ్మచారులు బోర్ కొడుతుందనే ఉద్దేశంతో సరదాగా ఔజా అనే ఒక గేమ్ అడుతారు. ఓ బోర్డు మీద ఇంగ్లీష్ లెటర్స్ ఉపయోగించి ప్రేతాత్మలతో మాట్లాడం ఈ గేమ్ థీమ్. అలా ఏదో టైమ్ పాస్ కోసం మొదలుపెడితే ఇది కాస్తా అనుహ్య సంఘటనలకు దారి తీస్తుంది.
ఓ వైపు భయపెడతూనే మరోవైపు నవ్విస్తూ కథ సాగుతుంది. ఇది చాలా మందికి తెలిసిన కథే. ఇక్కడ స్పిరిట్ గేమ్ అని అంటుంటారు. కానీ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించిన విధానం గొప్పగా ఉంటుంది. నటీనటులు కూడా పోటా పోటీగా నటించారు. తెరపై వీళ్లు నటించినట్లు అనిపించదు. పాత్రల్లో జీవించినట్లు అనిపిస్తుంది. కాగా ఇప్పుడీసినిమా ఓటీటీ రిలీజ్‌కు ముస్తాబవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్‌లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 7నుంచి స్ట్రీమింగ్ కానుంది.