‘కాంతార’ చిత్రం గత ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దక్షిణ కన్నడ సంస్కృతిలో భాగమైన భూతకోల నేపథ్య కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం డివోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ చిత్రానికి ప్రీక్వెల్‌ను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో తొలిభాగం ఆరంభానికి ముందు జరిగిన కథను చూపించబోతున్నారు. ఆగస్ట్ 27న చిత్రీకరణ మొదలుకానుందని సమాచారం.
ప్రీక్వెల్‌గా రానున్న ఈ రెండో భాగం గురించి చిత్ర దర్శకుడు, హీరో రిషబ్‌శెట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. ఈ సినిమా కోసం గుర్రపుస్వారీతో పాటు కొన్ని ప్రాచీన యుద్ధ విద్యల్లో శిక్షణ పొందబోతున్నారని చెబుతున్నారు. ఇక ఈ రెండో భాగంలో భూతకోల, పంజుర్లి దైవారాధన పుట్టుపూర్వోత్తరాలను..సంస్కృతిపరమైన ప్రాధాన్యతను ఆవిష్కరించబోతున్నారని సమాచారం. మొదటిభాగానికి పాన్ ఇండియా స్థాయిలో దక్కిన ఆదరణ దృష్ట్యా ప్రీక్వెల్‌ను భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక హంగులను మేళవించి తెరకెక్కించబోతున్నారని తెలిసింది.