Akhanda 2 Thandavam | టికెట్ ధరల పెంపు విషయంలో ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thandavam) నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ (14 Reels Plus) కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సినిమా టికెట్ల ధరల పెంపు మరియు ముందస్తు ప్రీమియర్లపై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. నందమూరి బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thandavam). ఈ సినిమా టికెట్ ధరలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వ్యులు జారీ చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాపై పెంచిన టికెట్ ధరలను అలాగే ప్రీమియర్ షోలను రద్దు చేయాలని కోరుతూ గురువారం హైకోర్టు సింగిల్ బెంచ్‌లో పిటిషన్ దాఖలైంది. అయితే పిటిషన్‌ను విచారించిన సింగిల్ బెంచ్… సినిమా ప్రీమియర్లను రద్దు చేయాలని, అలాగే టికెట్ ధరలను పెంచకూడదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ వెంటనే హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వ్యులపై స్టే విధించింది. ఈ నెల 14వ తేదీ వరకూ స్టే ఇస్తూ కీలక నిర్ణయం తీసుకోవడమే కాకుండా.. తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. దీంతో, ‘అఖండ 2’ టీమ్‌కు తాత్కాలికంగా ఊరట లభించినట్లయింది.