రవితేజ నటిస్తున్న ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘ఇరుముడి’ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన టైటిల్ కావడంతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. తండ్రీకూతుళ్ల అనుబంధం, ఆధ్యాత్మిక అంశాల కలబోతగా కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘ఇరుముడి కట్టు’ అనే అయ్యప్ప భక్తి ప్రధాన పాటతో పాటు ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది.
ఈ నెల 12న భీమవరంలో జరిగే వేడుకలో థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా శనివారం కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో రవితేజ రెండు పూర్తి భిన్నమైన అవతారాల్లో కనిపిస్తున్నారు.
కూతురిని అమితంగా ప్రేమించే తండ్రిగా రవితేజ పాత్ర తీవ్ర భావోద్వేగాలు, సంఘర్షణతో సాగుతుందని..ఇప్పటివరకు ఆయన ఈ తరహా పాత్రలో నటించలేదని మేకర్స్ తెలిపారు. ప్రియాభవానీశంకర్, సాయికుమార్, బేబీ నక్షత్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ.