తమ ప్రేమ, పెళ్లి గురించి సోషల్‌మీడియాతో పాటు పత్రికల్లో వచ్చే కథనాలకు ఎప్పటికప్పుడు వివరణ ఇస్తూ సందేహాలను నివృత్తి చేస్తున్నారు అగ్ర నాయకానాయికలు విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న. ఈ జంట పెళ్లిపీటలెక్కబోతున్నారంటూ గత నెలలో జాతీయ మీడియాలో సైతం వార్తలొచ్చాయి. అయితే వాటిలో ఏమాత్రం నిజం లేదని వారిద్దరూ స్పష్టత నిచ్చారు.
అయినా అభిమానులు మాత్రం సోషల్‌మీడియాలో ఏదో రకంగా నిజాన్ని రాబట్టాలని చూస్తున్నారు. వీరి బంధం గురించి పరోక్షంగా ప్రశ్నలడుగుతూ కాస్త ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఓ అభిమాని ట్విట్టర్ (ఎక్స్)లో పోస్ట్‌కు రష్మిక మందన్న స్పందించిన తీరు వైరల్‌గా మారింది. ‘రష్మిక మందన్న భర్తగా వచ్చే అబ్బాయికి ఉండాల్సిన లక్షణాలేమిటి’ అనే హెడ్డింగ్‌తో పోస్ట్ మొదలు పెట్టిన సదరు అభిమాని .. ‘ఆమె భర్త ‘వీడీ’లా ఉండాలి. ‘వీడీ’ అంటే వెరీ డేరింగ్ అని అర్థం. ఆమెను ఎప్పుడూ రక్షిస్తూ ఉండాలి.
మేము రష్మికను క్వీన్ అని పిలుస్తాం కాబట్టి పెళ్లాడబోయేవాడు కింగ్‌లా ఉండాలి’ అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌పై రష్మిక స్పందిస్తూ ‘మీరు చెప్పినవన్నీ నిజమే’ అంటూ లాఫింగ్ అండ్ లవ్ ఎమోజీని జోడించింది. అయితే ఈ పోస్ట్‌లో ‘వీడీ’ అంటే విజయ్ దేవరకొండేనని, సదరు అభిమాని పరోక్షంగా ఆయన పేరును ప్రస్తావించారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌కు రష్మిక ‘అవన్నీ నిజమే’ అంటూ సమాధానమివ్వడంతో ఈ జోడీ మధ్య ఏదో జరుగుతోందని అభిమానులు ఊహాగానాలు చేస్తున్నారు.