‘బ్రహ్మాస్త్ర’ మీడియా సమావేశం వేదికగా తన సతీమణి ఆలియాభట్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు రణ్‌బీర్‌కపూర్. ఈ జంట కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర బృందం దేశ వ్యాప్తంగా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొంటున్నారు. ఇటీవల ముంబయిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రణ్‌బీర్‌కపూర్ తన వైవాహిక జీవితం గురించి పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు.
బ్రహ్మచారిగా ఉన్నప్పుడు సొంతంగా అన్ని పనులు చేసుకునేవాడినని, ఇప్పుడు మాత్రం ప్రతీ విషయంలో అర్ధాంగి ఆలియాభట్పైనే ఆధారపడుతున్నానని చెప్పారు. ఒక్కోసారి భోజనాన్ని పక్కన పెట్టి ఆమె కోసం వెతుకుతుంటానని తెలిపారు. ఆలియా తనకు ఎలాంటి సహాయం చేయనవసరం లేదని, తన పక్కన ఉంటే చాలు సంతోషంగా ఉంటానని రణ్‌బీర్‌కపూర్ చెప్పుకొచ్చారు. ఆయన మాటలపై అలియాభట్ సరదాగా స్పందించింది. రణ్‌బీర్‌కు మతిమరపు కాస్త ఎక్కువేనని, ప్రతీ విషయాన్ని తానే గుర్తుచేయాల్సి ఉంటుందని పేర్కొంది.