Shekar Trailer Released | ఆంగ్రీ మ్యాన్ రాజశేఖర్ చాలా కాలం తర్వాత ‘గరుడవేగ’ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. కమర్షియల్‌గా కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్లను సాధించింది. తర్వాత వచ్చిన ‘కల్కి’ కూడా బాగానే ఆడింది. రెండు వరుస విజయాల తర్వాత రాజశేఖర్ ‘శేఖర్’ సినిమాతో రాబోతున్నాడు. జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్టయిన ‘జోసెఫ్’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది. చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు
‘పోలీస్ యూనిఫార్మ్ వేసుకుని కూడా డ్యూటీ చెయ్యని వాళ్ళు చాలా మంది ఉంటారు. అదే పోలీసు ఉద్యోగానికి రిసైన్ చేసి కూడా డ్యూటీ కోసం ప్రాణం ఇచ్చేవారు వేలల్లో ఒక్కరే ఉంటారు’ అంటూ మొదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ‘నీకెమైనా అయిపోతుందేమో అని భయమేస్తుంది నాన్న.. అయినా ఇంత ప్రేమున్నప్పుడు మీ ఇద్దరు ఎందుకు విడిపోయారు’ అంటూ శివానీ సంభాషణలు శేఖర్ గతాన్ని గుర్తుచేస్తున్నాయి. అంతలోనే శేఖర్ భార్య ఇందుకు యాక్సిడెంట్ అయిన న్యూస్ శేఖర్‌కు తెలుస్తుంది. అసలు ఇది యాక్సిడెంట్ కాదు.. హత్య అంటూ రాజశేఖర్ చెప్పే డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. యాక్సిడెంట్ చుట్టూ జరిగే ఈ కథలో హిందును హత్య చేసింది ఎవరు ఎందుకు చేశారు అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది.
ట్రైలర్ ఆధ్యాంతం ఆకట్టుకుంటుంది. అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం థ్రిల్ ఫీల్‌ను కలుగచేస్తుంది. మల్లికార్జున్ సినిమాటోగ్రఫి ఆకట్టుకుంటుంది. శివానీ రాజశేఖర్ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం మే 20న విడుదల కానుంది. అయితే మొదట ఈ చిత్రాన్నిలలిత్ దర్శకత్వం వహించాడు. కానీ కొన్ని కారణాల వల్ల అతను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఈ క్రమంలో జీవిత దర్శకత్వ బాధ్యతలు తీసుకుంది. సుధాకర్ ఇంపెక్స్ బ్యానర్‌పై బీరమ్ సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించాడు.