Srikanth odela | ప్రస్తుతం ఏ థియేటర్లో చూసిన ‘దసరా’ బొమ్మే. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూడడానికి థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. గతవారం రిలీజైన ఈ సినిమా తొలిరోజు నుంచే సత్తా చాటుతుంది. నాని కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. కమర్షియల్‌గానే కాదు ఈ సినిమాలో నటుల గురించి వాళ్ల నటన గురించి ప్రతీ ఒక్కరు గొప్పగా చెప్పుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా టాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యాడు. తొలి సినిమాకే ఈ రేంజ్ టేకింగ్ అంటే నమ్మలేకపోతున్నారు.
తెలిసిన కథే అయినా.. దాన్ని కొత్తగా చెప్పిన విధానానికి శ్రీకాంత్‌పై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. నాని ముందు నుంచి శ్రీకాంత్ ఓదెలా పనితీరును మెచ్చుకుంటూనే వస్తున్నాడు. నెక్స్ట్ బిగ్ థింగ్ శ్రీకాంత్ ఓదెలా అని కామెంట్స్ కూడా చేశాడు. దానికి ఏ మాత్రం తీసిపోని విధంగా శ్రీకాంత్ పేరు కూడా ఇక్కడే కాదు పక్క రాష్ట్రాల్లోనూ వినిపిస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా శ్రీకాంత్‌కు దసరా నిర్మాత సుధాకర్ చెరికూరి కాస్ట్లీ కారును బహుమతిగా ఇచ్చాడని సమాచారం. రూ.80 లక్షలు విలువజేసే బీఎండబ్ల్యూ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడట. అంతేకాకుండా చిత్రబృందానికి గోల్డ్ కాయిన్స్ బహుకరించాడట.
తొలిరోజు నుంచి దసరా మూవీ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. తాజాగా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాభాల బాట పట్టింది. ఈ సినిమాకు ఇప్పటివరకు రూ.92 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. బుధవారం కలెక్షన్లతో వంద కోట్లు మార్క్ టచ్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. నాని, కీర్తిసురేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలకపాత్ర పోషించాడు.