రివ్యూ: బలగం
నటీనటులు: ప్రియదర్శి, కావ్యా, కళ్యాణ్‌రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, వేణు టిల్లు, రచ్చ రవి
సాంకేతిక నిపుణులు:
కెమెరా: ఆచార్య వేణు, పాటలు: కాసర్ల శ్యామ్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో
నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత
దర్శకుడు: వేణు ఎల్ధండి
సంస్థ: దిల్‌రాజు ప్రొడక్షన్స్
కమెడియన్‌గా అందరికి సుపరిచితుడైన టిల్లు వేణు మెగాఫోన్ పట్టి దర్శకత్వం చేపట్టిన చిత్రం ‘బలగం’. హాస్య నటుడిగా అందరికి తెలిసిన వేణు తెలంగాణ నేపథ్యంతో ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్రానికి దిల్‌రాజు రెండో తరం వారసులు హన్షిత, హర్షిత్ రెడ్డి నిర్మాతలు కావడంతో అందరిలోనూ సినిమాపై ఆసక్తి పెరిగింది. విడుదలకు ముందే పలుచోట్ల షోలు ప్రదర్శించారు. అయితే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బలగం’ ఎలా వుంది?
Trailer
కథేంటంటే:
తెలంగాణ నేపథ్యంలో నడిచే ఓ పల్లెటూరి కథ ఇది. సాయిలు (ప్రియదర్శి) ఎటువంటి జాబ్ లేకపోవడంతో సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి అందులో నష్టపోతాడు. దీనికి తోడు ఊర్లో అప్పుల బాధలు పెరగడంతో.. పెళ్లి చేసుకుంటే వచ్చే కట్నంతో అప్పులు తీర్చాలని నిర్ణయించుకుంటాడు. ఇంతలోనే సాయిలు తాత కొమరయ్య (సుధాకర్ రెడ్డి) చనిపోవడం.. చావు ఇంట్లో జరిగిన గొడవంతో పెళ్లి కాస్తా క్యాన్సల్ అవుతుంది. కొమరయ్య మరణంలో కుటుంబసభ్యులంతా ఊరికి చేరుకుంటారు. ఇరవయ్యేళ్ల నుండి పుట్టింటికి దూరమైన మేనత్త, మేనమామ, కూతురు సంధ్య (కావ్య) కూడా అక్కడికి వస్తారు. అయితే చిన్నకర్మ రోజున పెట్టిన పిండం కాకి ముట్టదు..దీంతో కుటుంబంలో గొడవలు మరింత పెరుగుతాయి. ఇక ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది? ఆ తరువాత ఐదో రోజు, పదకొండ రోజు పెట్టిన పిండం కాకి ముట్టిందా? లేదా? కుటుంబ సభ్యుల గొడవలు ఎలా సద్దుమణిగాయి అనేది మిగతా కథ
విశ్లేషణ:
చావు చుట్టు అల్లుకున్న భావోద్వేగపూరితమైన కథ ఇది.తెలంగాణ సంస్కృతి, యాస, తెలంగాణ పల్లె జీవితాల్ని అత్యంత సహజంగా చూపిస్తూ అందరికి తమ జీవితాలను జ్ఞప్తికి తెచ్చే విధంగా ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా మలిచారు. తెలంగాణ పల్లె జీవితాల్ని , అక్కడి మనుషుల అమాయకత్వం సినిమాలోని ప్రతి పాత్ర ఎంతో సహజంగా వుండేటట్లు చిత్రీకరణ జరిపిన రాజన్న సిరిసిల్ల గ్రామంలోని వారినే ఆర్టిస్టులుగా తీసకోవడం ఈ సినిమాకు ఎంతో ఉపయోగపడింది. చావు దగ్గర మనుషులు స్పందించే తీరు, వారి ప్రవర్తన మనకు మన నిత్య జీవితంలో చూసినట్లుగానే వుంటుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ప్రతి ప్రేక్షకుడు ప్రతి పాత్రతో ప్రయాణించే విధంగా చిత్రం ఆద్యంత ఒక ఎమోషన్‌తో కొనసాగుతుంది. తెలంగాణ వచ్చిన తరువాత మనం చూసిన అచ్చ తెలంగాణ సినిమా ఇదే అనిపిస్తుంది. తెలంగాణ సంప్రదాయాల్లో భాగమైన అలవాట్లు, చావు దగ్గర ఒగ్గుకథలు ఇలా ప్రతిది ఎంతో డిటైల్డ్‌గా చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. అన్నా చెలెళ్ల అనుబంధం గురించి రాసుకున్న సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిసాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో వచ్చే సన్నివేశం అందరి హృదయాలను బరువెక్కిస్తాయి.
నటీనటుల పనితీరు:
సాయిలు పాత్రలో ప్రియదర్శి నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కామెడీ సన్నివేశాల్లో ఎంతగా ఆకట్టుకున్నాడో.. బరువైన ఎమోషన్స్ సీన్స్‌లో కూడా తన నటన ప్రతిభను నిరూపించుకున్నాడు. కొమరయ్యగా సుధాకర్ రెడ్డి కనిపించిన కాసేపు అయినా తన హుషారైన నటనతో సినిమాను పరుగులు పెట్టిస్తాడు.. ఆ పాత్ర ఇంకా కాసేపు వుంటే బాగుండు అనిపించే స్థాయిలో ఆకట్టుకున్నాడు. మేనమామగా మురళీధర్ గౌడ్, మేనత్తగా రూప లక్ష్మీ , సంధ్యగా కావ్య తమ పాత్రలకు న్యాయం చేశారు. స్నేహితుడు పాత్రలో నటించిన రచ్చరవి ఆకట్టుకున్నాడు.
సాంకేతిక నిపుణల ప్రతిభ:
ముందుగా చెప్పాల్సింది దర్శకుడు వేణు ఎల్ధండి గురించి, తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను, భాషను ప్రతిది క్షుణ్ణంగా చెప్పిన తీరు అద్భుతంగా ప్రతి సన్నివేశంలోనూ దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నాడు. చావు చుట్టు అల్లుకున్న కథలో కమర్షియల్ అంశాలు జోడించిన విధానం దర్శకుడి అతని ప్రతిభను చాటింది. ‘బలగం’తో వేణు రూపంలో తెలుగు సినీ పరిశ్రమకు ఓ మంచి దర్శకుడిని అందించిన ఘనత మాత్ర నిర్మాత దిల్ రాజుదే. ఎందుకంటే ఇలాంటి కథను సినిమాగా వేణు తెరకెక్కిస్తాడని నమ్మడం, ఆ కథను జడ్జ్ చేయడం అంతా ఈజీ కాదు. అంతేకాదు నిర్మాత దిల్ రాజు తన జీవితకాలం చెప్పుకునే ఓ గొప్ప సినిమాను ‘బలగం’రూపంలో ప్రేక్షకులకు అందించాడు. భీమ్స్ సంగీతం, కాసర్ల శ్యామ్ పాటలు, మధు కెమెరాపనితనం సినిమాకు ప్రధానబలాలుగా నిలిచాయి.
ఫైనల్‌గా :
‘బలగం’ తెలంగాణ మట్టి కథ, తెలంగాణ ఆత్మను, సంస్కృతిని, సంప్రదాయాలకు ఒక ఎమోషనల్ కథాంశాన్ని జోడించి రూపొందించిన ఒక ఎమోషనల్ రైడ్.. హృద్యమైన భావోద్వేగాలతో, మనసుకి హత్తుకునే సినిమా ఇది. ఇలా మనదైన జీవితాన్ని ఒడిసిపట్టే కథలు అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి అరుదైన సినిమాను థియేటర్లో చూస్తున్నంత సేపు పొందే ఆ భావోద్వేగాలు.. అనుభూతి తప్పకుండా అందరూ కుటుంబంతో వెళ్లి అనుభవించాల్సిందే.. అచ్చ తెలంగాణ సినిమాను ఆదరించి ప్రేక్షకులే కొండంత బలగం నిలుస్తే ఇలాంటి మరిన్ని మంచి సినిమాలు రావడానికి ఆస్కారం వుంటుంది. సో.. డోంట్ మిస్ బలగం..!
రేటింగ్ : 3.5 / 5.