దివంగత సూపర్‌స్టార్ కృష్ణ కీలక పాత్రలో నటించిన ఆఖరి చిత్రం ‘ప్రేమ చరిత్ర కృష్ణ విజయం’. ఈ సినిమాలో యశ్వంత్, సుహాసినీ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని అంబ మూవీ పతాకంపై శ్రీపాద్ హంచాటే నిర్మించారు. హెచ్.మధుసూదన్ దర్శకుడు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ నెలలో సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో దర్శకుడు హెచ్.మధుసూదన్ మాట్లాడుతూ…‘దర్శకుడిగా నా తొలి చిత్రం ‘వంశం’. ఈ సినిమాకు మంచి పేరు వచ్చింది. దాంతో నిర్మాత హంచాటే పిలిచి కృష్ణ గారి సినిమా చేసే అవకాశం ఇచ్చారు. 2007లో పూర్తి చేసిన ఈ చిత్రం ఇప్పటిదాకా విడుదలకు నోచుకోలేదు. సూపర్‌స్టార్‌తో నేను చేసిన సినిమాను ఎలాగైనా విడుదల చేయాలని నిర్మాత దగ్గరనుంచి తీసుకుని కొత్త టెక్నాలజీతో రిలీజ్‌కు తీసుకు వస్తున్నాం’ అన్నారు.