Prabhas | టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన క్రేజ్ ఏ స్థాయిలో ఉందో నిరూపించారు. బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలిని ఉద్దేశిస్తూ చెప్పిన “వీడు ఎక్కడున్నా రాజేరా” అనే డైలాగ్ తెరపై ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. ఇప్పుడు అదే మాట ప్రభాస్‌కు నిజ జీవితంలోనూ సరిపోతుందని అభిమానులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా అభిమానుల్లో ఆయనకు ఉన్న ఆదరణ మరోసారి బయటపడింది. భారతదేశంలోని ప్రముఖ మీడియా కన్సల్టింగ్, డేటా అనలిటిక్స్ సంస్థ ఆర్మాక్స్ మీడియా తాజాగా విడుదల చేసిన మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జాబితాలో ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచారు. విశేషం ఏమిటంటే ఇది ఒకసారి లేదా రెండుసార్లు కాదు.. వరుసగా నాలుగోసారి ఆయన ఈ ఫీట్‌ను సాధించారు. గత నాలుగేళ్లుగా ప్రభాస్ నంబర్-1 స్థానాన్ని తన పేరిట నిలబెట్టుకోవడం అభిమానుల్లో ఆనందాన్ని రెట్టింపు చేసింది.
ఆర్మాక్స్ మీడియా ప్రతి నెల, ప్రతి సంవత్సరం సినిమా, టెలివిజన్, ఓటీటీ రంగాలకు సంబంధించిన కంటెంట్, సెలబ్రిటీల ప్రజాదరణపై ప్రత్యేక సర్వేలు నిర్వహిస్తూ ఉంటుంది. సోషల్ మీడియా ట్రెండ్స్, ప్రేక్షకుల ఆసక్తి, డిజిటల్ ఎంగేజ్మెంట్ వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకింగ్స్ రూపొందిస్తారు. ఈ ఏడాది విడుదలైన జాబితాలో కూడా ప్రభాస్ తన ఆధిపత్యాన్ని కొనసాగించడం విశేషంగా మారింది. ఈసారి టాప్-10 జాబితాలో టాలీవుడ్ హీరోల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ప్రభాస్ అగ్రస్థానంలో నిలవగా, అల్లు అర్జున్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. అలాగే మహేష్ బాబు ఐదో స్థానంలో, రామ్ చరణ్ ఏడో స్థానంలో నిలిచారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా టాప్-10లో చోటు సంపాదించారు.
టాప్-10లో ఐదు స్థానాలను టాలీవుడ్ స్టార్లు దక్కించుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు సినిమా ప్రభావం దేశవ్యాప్తంగా ఎంతగా పెరిగిందో ఈ ర్యాంకింగ్స్ మరోసారి చూపిస్తున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. “అదిరా డార్లింగ్ రేంజ్”, “బాక్సాఫీస్ కింగ్ మాత్రమే కాదు.. పాపులారిటీ కింగ్ కూడా” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. రాబోయే భారీ ప్రాజెక్టులతో ప్రభాస్ మరింత సంచలనాలు సృష్టిస్తారనే అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి.