పానిండియా సూపర్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. వాటిల్లో ఒకటి హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ కాగా, రెండోది సందీప్‌రెడ్డి వంగా ‘స్పిరిట్’. వీటిల్లో ‘ఫౌజీ’ ముందు విడుదల కానున్నది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. నిజానికి ఈ ఏడాది ఆగస్ట్ 14నే ఈ సినిమాను విడుదల చేయాలని ముందు మేకర్స్ భావించారు. కానీ సినిమాను పర్ఫెక్ట్గా తెరకెక్కించడానికీ, నాణ్యమైన వీఎఫ్ఎక్స్ కోసం కాస్త సమయం తీసుకున్నట్టు తెలిసింది.
ఈ క్రమంలోనే ఈ ఏడాది డిసెంబర్ 3న ‘ఫౌజీ’ని విడుదల చేయాలనే ఆలోచనలో టీమ్ ఉన్నట్టు సమాచారం. రెండో ప్రపంచయుద్ధం కాలంనాటి పీరియడ్ డ్రామాగా దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో తిరుగుబాటుదారుడిగా మారిన ఓ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ సైనికుడిగా ఇందులో ప్రభాస్ కనిపించనున్నారు.
ఈ పీరియాడిక్ డ్రామాలో అద్భుతమైన ప్రేమకథ కూడా మిళితమై ఉన్నదని వినికిడి. ఇమాన్వీ హీరోయిన్గా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో మిథన్చక్రవర్తి, అనుపమ్‌ఖేర్, జయప్రద కీలక పాత్రధారులు. విశాల్‌చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ పానిండియా చిత్రాన్ని మైత్రీమూవీమేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.