Pawan Kalyan | తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత, ప్రముఖ నటుడు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా విజయ్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌తో పాటు ఆయన మంత్రివర్గ సభ్యులందరికీ పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. “తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తిరు విజయ్‌కు, అలాగే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు” అంటూ ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
కొత్త ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని పవన్ ఆకాంక్షించారు. పారదర్శకత, అభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా ముందుకు సాగుతూ తమిళనాడును మరింత ప్రగతిపథంలో నడిపించాలని విజయ్ ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తూ తమిళనాడును మరింత సుభిక్షంగా తీర్చిదిద్దాలని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. సినిమా రంగంలో స్టార్ హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న విజయ్.. రాజకీయాల్లోకి అడుగుపెట్టి తక్కువ కాలంలోనే సంచలన విజయాన్ని అందుకున్నారు. పార్టీ స్థాపించిన రెండేళ్లకే ఎన్నికల బరిలోకి దిగిన ఆయన.. ప్రజల మద్దతుతో అధికార పీఠాన్ని అధిరోహించడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఇక పవన్ కళ్యాణ్ కూడా సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీని స్థాపించారు. గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేసి ఘన విజయం సాధించగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు తమిళనాడులో విజయ్, ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ ఇద్దరూ స్టార్ నటుల నుంచి ప్రజా నాయకులుగా మారి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం దక్షిణాది రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.