Hero Nikhil | రొడ్డకొట్టుడు సినిమాలు చేయకుండా, ఇమేజ్‌కోసం పాకులాడకుండా, చక్కని కథలను ఎంపికచేసుకుంటూ వైవిధ్యమైన నట ప్రయాణాన్ని సాగిస్తున్నాడు హీరో నిఖిల్. ‘కార్తికేయ’ సిరీస్ అతని కెరీర్ గ్రాఫ్‌నే మార్చేసిందని చెప్పాలి. ఆ సినిమాలతో తను పాన్ ఇండియా గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభూ’.
చారిత్రాత్మక నేపథ్యంతో సాగే ఈ సినిమాలో నిఖిల్ యుద్ధవీరుడిగా కనిపించనున్నాడు. ఈ తరహా పాత్ర చేయడం నిఖిల్‌కి ఇదే ప్రథమం. యుద్ధవీరుని పాత్ర అంటే కత్తి యుద్ధాలు, గదాయుద్ధాలు, మల్లయుద్ధాలు తదితర యుద్ధవిద్యల్లో నైపుణ్యం అవసరం. అందుకే నిఖిల్ కత్తి తిప్పటం నేర్చుకునే పనిలోవున్నాడు. దానికోసం ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటూ ఓ వీడియోను కూడా విడుదల చేశాడు.
కఠోరంగా శ్రమించి రెండు చేతులతో కత్తి తిప్పడం నేర్చుకుని, సవ్యసాచిగా నిలిచాడని ఆ వీడియో చూసిన పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇందులో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తున్నది. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: రవి బన్రూర్, నిర్మాతలు: భువన్, శ్రీకర్, దర్శకత్వంలో భరత్ కృష్ణమాచారి.