కరోనా విలయతాండవంలో చిక్కుకుని చాలా మంది ప్రజలు, ప్రముఖులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కంటికి కనిపించని ఈ మహమ్మారి కారణంగా కన్నీరు ఆగడం లేదు. కావాల్సిన వాళ్లను ఒక్కొక్కరుగా దూరం చేస్తూనే ఉంది ఈ మాయదారి వైరస్. ఇప్పటికే ఎంతోమందిని కాటేసింది కరోనా. తాజాగా మరో దర్శకుడిని కూడా తనతో పాటు తీసుకెళ్లిపోయింది. మొన్నటికి మొన్న నాలుగు రోజుల కింద తమిళ ప్రముఖ దర్శకుడు కేవీ ఆనంద్ కూడా కరోనాతోనే చనిపోయాడు. ఆయన మరణవార్త ఇంకా పచ్చిగా ఉండగానే తెలుగులో కుమార్ వట్టి, శ్రవణ్ లాంటి దర్శకులను కూడా కరోనా కాటేసింది. అంతలోనే సాహో నటుడు బిక్రమ్ జీత్ కూడా కరోనాతో మరణించాడు. నిన్నటికి నిన్న తమిళ ఇండస్ట్రీలో యువ నిర్మాత ముత్తు కుమరన్ కూడా కరోనాతోనే తనువు చాలించాడు.
ఇప్పుడు మరో దర్శకుడు కూడా కరోనాతో కన్నుమూసాడు. అతడి పేరు నవీన్. కేవలం 36 ఏళ్ళ వయసులోనే ఈయన వైరస్ కారణంగా చనిపోయాడు. ఈయన మరణంతో కన్నడనాట విషాద ఛాయలు అలుముకున్నాయి. వన్ డే ఇన్ 2011 సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నవీన్.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అందులో అప్పు వెంకటేష్, రేవన్న ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా రెండో సినిమాకు కథ సిద్ధం చేసుకుంటున్న తరుణంలోనే కరోనా ఈయన్ని కాటేసింది. చాలా మంది ప్రముఖ దర్శకుల దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసాడు నవీన్. దర్శకుడిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సమయంలో కరోనా కాటేయడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కన్నడ సినీ ప్రముఖులు కూడా నవీన్ మృతికి సంతాపం తెలిపారు.
ఇవికూడా చదవండి..