కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి తనకో ప్రత్యేకత తెచ్చుకున్నారు హీరో కళ్యాణ్ రామ్. ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలో భారీ చిత్రాలు నిర్మించి నిర్మాతగానూ అభిరుచి చాటుకున్నారు. ఆయన నటించిన కొత్త సినిమా ‘బింబిసార’. ఈ సినిమాను కె హరికృష్ణ నిర్మాణంలో నూతన దర్శకుడు వశిష్ఠ్ రూపొందించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపారు కళ్యాణ్ రామ్.
‘బింబిసార’ ప్రయాణం ఎలా మొదలైంది?
దర్శకుడు వశిష్ఠ్ మూడేళ్ల కిందట ఈ కథ చెప్పాడు. స్టోరీలోని టైమ్ ట్రావెల్, ఫాంటసీ అంశాలు నచ్చాయి. సినిమా చేద్దామని చెప్పాను. ఆ తర్వాత ప్రతి పాత్రను, సన్నివేశాలను మలుచుకుంటూ వచ్చాడు. అలా ఈ సినిమా రూపుదిద్దుకుంది.
కొత్త దర్శకుడిని నమ్మి భారీ సినిమా ఇవ్వడానికి కారణం?
‘అతనొక్కడే’ సినిమా నిర్మించినప్పుడు అది అప్పటికి భారీ బడ్జెట్ సినిమానే. తొలిసారి యాక్షన్ సినిమాలో నటించాను. ప్రేక్షకులు ఆదరించారు. కథ బాగుంటే కొత్త దర్శకుడితో గొప్ప సినిమాలు చేయొచ్చు. వాళ్లకు కొంత సమయం ఇచ్చి, మంచి ఆర్టిస్టులను పెట్టగలిగితే ఫలితం బాగుంటుంది.
ఒక రాజు పాత్రలో నటించిన అనుభవం ఎలా ఉంది?
రాజుగా మెప్పించగలనా సందేహం కలిగింది. తాతయ్య ఎన్టీఆర్ రాజు పాత్రల్లో ఆకట్టుకున్నారు. ప్రభాస్ ‘బాహుబలి’తో రాజు అంటే ఎలా ఉండాలో చూపించారు. మన వంతు ప్రయత్నం చేయకుంటే వాళ్లతో పోల్చి విమర్శిస్తారు. అందుకే బరువు తగ్గాను, కాస్ట్యూమ్స్ డిజైన్ చేయించాం, కళ్ల కింద కాటుకతో ఒక మంచి లుక్‌లోకి తీసుకొచ్చాం. ఇందుకు రెండు నెలల సమయం పట్టింది.
మీ చిత్రానికి ‘బాహుబలి’తో పోలిక తేవడం సరైనదేనా?
‘బాహుబలి’కి యాక్షన్ సీక్వెన్సులు ఆకర్షణగా నిలిచాయి. వేల మందితో భారీ యుద్ధ సన్నివేశాలు తెరకెక్కించారు. మా చిత్రంలో అలాంటివి ఉండవు. ఒక దుష్ట రాజు మంచి వాడిగా ఎలా మారాడు అనేది కథ. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్‌తో టైమ్ ట్రావెల్ సినిమాను చేశాం.
ఇతర భాషల్లో మీ చిత్రాన్ని విడుదల చేస్తున్నారా?
నా సినిమాలకు ఉన్న బడ్జెట్ పరిమితులను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం కేవలం తెలుగులోనే విడుదల చేస్తున్నాం. ఇతర భాషల్లోకి సినిమాను తీసుకెళ్లాలంటే అదనపు ఖర్చు నిర్మాతకు అవుతుంది. ఇక్కడ విజయం సాధించిన తర్వాత తప్పకుండా మిగతా భాషల్లో విడుదల చేస్తాం.
సినిమాల విషయంలో మీ ఫిలాసఫీ ఏంటి?
నేను చేసిన హిట్ చిత్రాలు వేరే హీరోల దగ్గరకు వెళ్లినా చివరకు నాకు దక్కాయి. అలా కథే హీరోను వెతుక్కుంటూ వస్తుందనేది నా నమ్మకం. ఇలాంటి సినిమా చేస్తానని నేను ఊహించలేదు, భవిష్యత్‌లో చేస్తాననేదీ తెలియదు.
జానపద చిత్రాల్లో మీకు ఇష్టమైన సినిమాలేవి?
తాతయ్య చేసిన ‘పాతాళభైరవి’ నా ఫేవరేట్ మూవీ. ఆ సినిమా స్ఫూర్తితోనే బాలకృష్ణ బాబాయ్ ‘భైరవద్వీపం’ సినిమా చేశారు. అలాగే చిరంజీవి గారు నటించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ కూడా నేను ఇష్టపడే సినిమా.
నిర్మాతగా ఉండటం వల్ల నటుడిగా న్యాయం చేయలేకపోతున్నారా?
నిర్మాతగా వ్యవహరించడం నాపై ఒత్తిడి పెంచింది. సినిమాకు ఎంత ఖర్చవుతోంది, ఏం జరుగుతోంది అనే ఆలోచనలే మెదిలేవి. అందుకే నేను నటించే సినిమాల ప్రొడక్షన్ పనులకు దూరంగా ఉంటున్నాను. నటన మీద దృష్టి పెడుతున్నాను. రెండు పడవల మీద కాలు పెట్టకూడదు అనుకుంటున్నాను.
నిర్మాణవ్యయం తగ్గించుకోవాలని నిర్మాతలు అంటున్నారు
మా సినిమా వరకు ఎంతలో నిర్మించాలని అనుకున్నామో అంత బడ్జెట్లోనే చేశాం. పెట్టిన ఖర్చుకు, సినిమా బిజినెస్ చూస్తే నిర్మాతగా నేను హ్యాపీగా ఉన్నాను. మిగతా నిర్మాతల పరిస్థితి మీద నాకు అవగాహన లేదు.
ఎన్టీఆర్, బాలకృష్ణతో కలిసి మీరు మల్టీస్టారర్ మూవీ చేసే ఆలోచన ఉందా?
మల్టీస్టారర్ మూవీస్ చేయడం చాలా కష్టం. మనకు ఎన్నేళ్ల తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ లాంటి మల్టీస్టారర్ వచ్చింది. ఇద్దరు పెద్ద హీరోల ఇమేజ్ను సంతృప్తిపరిచేలా సినిమా రూపొందించడం అనేది సాధారణ విషయం కాదు. రాజమౌళి దర్శకుడు కాబట్టి మెప్పించగలిగాడు.
ఎన్టీఆర్ 30 సినిమా ఎలా ఉండబోతున్నది?
మా సంస్థలో ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ప్రకటించాం. ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ వరల్డ్ వైడ్ పెరిగింది. ఆ అంచనాలు అందుకునే సినిమా నిర్మించాలి. ఆ ఒత్తిడి నిర్మాతగా నాపైనా, దర్శకుడు కొరటాల శివపైనా ఉంది.
థియేటర్ల దగ్గరి ప్రతికూల పరిస్థితులు మీపై ఒత్తిడి పెంచాయా?
మన ప్రేక్షకులకు సినిమానే ప్రధాన వినోద సాధనం. మంచి సినిమా చేస్తే తప్పకుండా థియేటర్లకు వస్తారు. ఈ మధ్య ‘మేజర్’, ‘విక్రమ్’ లాంటి చిత్రాలు థియేటర్లో చూశారు. మనం ముందు ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాలి. అది చూస్తేనే సినిమా కోసం థియేటర్‌కు వెళ్లాలని అనిపించాలి. మంచి సినిమా విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు.