ఉదయ్ శంకర్, జెన్నీ జంటగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’. శ్రీరామ్ ఆర్ట్స్ పతాకంపై అట్లూరి నారాయణరావు నిర్మించారు. గురు పవన్ దర్శకుడు. ఈ చిత్ర సక్సెస్ మీట్‌ను తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించారు. నిర్మాత అట్లూరి నారాయణ రావు మాట్లాడుతూ…‘మా సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్నది. చిన్న చిత్రమైనా వైవిధ్యమైన కథ, కథనాలతో రూపొందించారనే పేరు వచ్చింది. హైదరాబాద్‌లో ప్రదర్శనలు పెంచుతున్నాం’ అన్నారు.
దర్శకుడు గురు పవన్ మాట్లాడుతూ ‘చిన్న సినిమాను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. చివరి పది నిమిషాలు కట్టిపడేశాయి అంటున్నారు. థియేటర్లో ఎంజాయ్ చేయాల్సిన చిత్రమిది’ అన్నారు. హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ…కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాన్నైనా ఆదరిస్తామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. సినిమా ప్రారంభమైన ఐదు నిమిషాల నుంచే కథలో లీనమవుతున్నారు. థ్రిల్లర్ ఎలిమెంట్స్ బాగున్నాయని అంటున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల కష్టానికి ఫలితం దక్కింది. సినిమా విడుదలైన అన్ని చోట్లా షోస్ పెంచుతున్నాం’ అన్నారు.