మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి నటిస్తున్న 156వ సినిమా ఇది. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది తాజాగా అదే టైటిల్‌ను ఖరారు చేశారు. సోమవారం టైటిల్ ప్రకటనతో పాటు కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు. విశ్వంభర అంటే విశ్వమును భరించువాడు, పాలించువాడు శ్రీమహావిష్ణువు, విశ్వమంతా తానే ఉన్నవాడు త్రివిక్రమ అవతారంలోని వామనుడు..ఇలా అనేక అర్థాలున్నాయి.
కాన్సెప్ట్ వీడియోలో రుద్రాక్ష ఆకారంలో ఉన్న ఒక పెట్టె ఆకాశంపై నుంచి కిందకు రావడం, మధ్యలో ఓ శకలాన్ని ఢీకొట్టి భూమికి చేరుకోవడం, అక్కడొక భారీ హనుమాన్ విగ్రహం దర్శనమివ్వడాన్ని చూపించారు. సోషియో ఫాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో చిత్రబృందం చెప్పినట్లుగానే పంచభూతాలు, ముల్లోకాల కాన్సెప్ట్‌కు ఆధ్యాత్మిక అంశాలను జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతున్నది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ మారేడుమిల్లిలో జరుగుతున్నది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఛోటా కె నాయుడు, సంగీతం: యం.యం.కీరవాణి, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, రచన-దర్శకత్వం: వశిష్ట.