సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై
జీ5: మే 23
తారాగణం: మనోజ్ బాజ్పాయ్, అద్రిజ, సూర్యమోహన్ కుమార్ తదితరులు
దర్శకత్వం: అపూర్వ్ సింగ్ కర్కీ
వాస్తవ గాథలు సినిమాలుగా రూపాంతరం చెందడం ఎప్పట్నుంచో ఉన్నదే! ఇలాంటి సినిమాల్లో విశేష ఆదరణ పొందినవి అనేకం. ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ కూడా ఈ తరహా చిత్రమే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆసారాం బాపు నిందితుడిగా ఉన్న అత్యాచారం కేసు ఆధారంగా దీన్ని నిర్మించారు. కథలోకి వెళ్తే ఓ పదహారేండ్ల బాలికపై ఒక బాబా (ఆశ్రమ నిర్వాహకుడు) అత్యాచారానికి పాల్పడతాడు. దైవంగా భావించే వ్యక్తి తమ కూతురు జీవితాన్ని నాశనం చేశాడని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయిస్తారు. బాబాపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తారు పోలీసులు. కోర్టులో విచారణ మొదలవుతుంది. న్యాయవాది పీసీ సోలంకి (మనోజ్ బాజ్పాయ్) ఆ బాలిక తరఫున వాదనలు వినిపిస్తాడు. బాబాకు బెయిల్ ఇప్పించడానికి గొప్పగొప్ప లాయర్లు రంగంలోకి దిగుతారు. తన వాదనతో బెయిల్ రాకుండా చేయగలుగుతాడు సోలంకి. ఈ క్రమంలో బాబా బంట్లు సాక్షులను వెంటాడి మరీ చంపుతుంటారు. సోలంకీని కూడా వెంటాడుతుంటారు. ఇంతకీ ఈ కేసు ఏమైంది? ఆ బాలికకు న్యాయం జరిగిందా లేదా? అన్నది మిగిలిన కథ! కోర్టు సీన్లు ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. న్యాయవాదిగా మనోజ్ బాజ్పాయ్ నటన సినిమాకు అదనపు బలం. అందుకే ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నది.