Manchu Vishnu | రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. ఇటీవల ఇప్ప పువ్వు సారా అంశంపై వార్తల్లో నిలిచిన ఆయన, తాజాగా డ్రగ్స్ నియంత్రణపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.జడ్చర్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, డ్రగ్స్ సమస్యపై కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీపై వస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ, సినీ నటులు సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. సినిమా హీరోలు, హీరోయిన్లకు సమాజంలో అపారమైన ప్రభావం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. హీరోలు ఏం చేస్తే అభిమానులు అదే అనుసరిస్తారు. అందుకే వారు డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ముందుకు రావాలి అని సూచించారు.
ఈ సందర్భంగా ఆయన చేసిన సూచన ఏంటంటే.. హీరోలు ప్రతి 90 రోజులకు ఒకసారి డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలని అన్నారు. యూరిన్ టెస్ట్ ద్వారా 14 రోజుల వరకు మాత్రమే సమాచారం తెలుస్తుంది. కానీ వెంట్రుకల పరీక్ష ద్వారా 90 రోజుల వరకు డ్రగ్స్ వినియోగం తెలుసుకోవచ్చు అని వివరించారు. హీరోలు స్వచ్ఛందంగా డ్రగ్స్ టెస్టులు చేయించుకుని ప్రజల్లో అవగాహన కల్పిస్తే సమాజంలో మార్పు వస్తుంది అని అన్నారు. ఇక, డ్రగ్స్ టెస్ట్ చేసిన వారికే సినిమాల విడుదలకు అనుమతి ఇవ్వాలని కూడా సూచించారు. సినిమా ఇండస్ట్రీ డ్రగ్స్ సంస్కృతికి కేంద్రంగా మారుతోందన్న ఆరోపణలు ఉన్నాయని, వాటిని అరికట్టాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలపై సినీ నటుడు మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఇది చాలా మంచి సూచన అని పేర్కొన్న మంచు విష్ణు.. ఎన్నికల్లో రాజకీయ నాయకులు నామినేషన్ దాఖలు చేసే ముందు.. ఎలాంటి పరీక్షలు చేసుకోవాలో అని నేను ఆలోచిస్తున్నా అని విష్ణు అన్నారు. ప్రజా ప్రతినిధులు కూడా పారదర్శకంగా ఉంటే ఓటర్లు కూడా సంతోషిస్తారని తాను భావిస్తున్నట్లు మంచు విష్ణు స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు ఎమ్మెల్యే సూచనలను సమర్థిస్తూ, హీరోలు డ్రగ్స్ టెస్టులు చేయించుకుని సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు విమర్శిస్తూ, రాజకీయ నాయకులపైనా ఇలాంటి కఠిన నిబంధనలు ఉండాలని అంటున్నారు.
Good suggestion.
Now just wondering — what’s the equivalent test before filing a nomination for elections?
I am sure the voters would be happy to collaborate on a common framework with the respected MLA. https://t.co/svIOvfxkOu
— Vishnu Manchu (@iVishnuManchu) March 31, 2026