Mammootty | సినీ పరిశ్రమలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి విలక్షణ నటన ప్రదర్శిస్తుంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ తన ప్రత్యేకతను, కళాతృష్ణను ప్రపంచానికి తెలియజేస్తూ పేరుకు తగ్గట్టే మమ్ముట్టి మరోమారు వినూత్న ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఓవైపు తన కుమారుడు దుల్కర్ సల్మాన్ వరుస సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా ప్రేక్షకాదరణ పొందుతుండగా, దేశంలో మరో నటుడు చేయడానికి భయపడే కథలను ఎంపిక చేసుకుంటూ ప్రత్యేకత చాటుతున్నారు. ఇటీవల ‘కాథల్: ది కోర్’ సినిమాలో ‘గే’ పాత్రలో నటించడం ద్వారా మిగతా నటులకు తాను ఎంత భిన్నమో చెప్పకనే చెప్పారాయన.
తాజాగా బ్లాక్ అండ్ వైట్ కాలాన్ని మరోమారు తెరమీదకు తీసుకువచ్చి వార్తల్లోకెక్కారు. ఆయన నటించిన ‘భ్రమయుగం’ చిత్రాన్ని బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్లో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కేరళలోని చీకటి యుగంలో జరిగే ఈ భయానక కథలో మమ్ముట్టి మాంత్రికుడి పాత్ర పోషిస్తున్నారు. ‘భూతకాలం’ ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 15న దాదాపు 139 నిమిషాల (2.19 గంటలు) నిడివితో ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం టీజర్, ఫస్ట్‌లుక్‌తో దేశవ్యాప్తంగా అటెన్షన్ క్రియేట్ చేసిన ఈ సినిమాను నైట్‌షిఫ్ట్ స్టూడియోస్ సంస్థ నిర్మించింది.