Lenin | ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటి నుంచి అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తొలి మూడు రోజుల్లోనే రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. నాలుగో రోజు కలెక్షన్లలో మాత్రం సహజమైన డ్రాప్‌ను నమోదు చేసింది. అయినప్పటికీ మొత్తం వసూళ్ల పరంగా దూసుకెళ్తూ అఖిల్ కెరీర్లోనే అతిపెద్ద కమర్షియల్ హిట్‌గా నిలిచే దిశగా అడుగులు వేస్తోంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అఖిల్ పవర్ఫుల్ యాక్షన్, భాగ్యశ్రీ బోర్సే నటన, ఎస్. థమన్ అందించిన సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మాస్ సెంటర్లలో సినిమాకు మంచి ఆదరణ లభిస్తుండటంతో విడుదలైన తొలి రోజు నుంచే కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది.
మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.16.7 కోట్ల గ్రాస్ వసూలు చేసి అఖిల్ కెరీర్లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్ నమోదు చేసిన ఈ చిత్రం, వీకెండ్ ముగిసే సమయానికి మూడు రోజుల్లో రూ.61.1 కోట్ల గ్రాస్ సాధించి సంచలనం సృష్టించింది. ఈ జోరుతో డిస్ట్రిబ్యూటర్ల పెట్టుబడులు కూడా వేగంగా రికవరీ అవుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వీకెండ్ తర్వాత వచ్చే సోమవారం దాదాపు అన్ని సినిమాల కలెక్షన్లు తగ్గడం సాధారణమే. అదే పరిస్థితి ‘లెనిన్’కు కూడా ఎదురైంది. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా మంచి స్పందన కనిపించినప్పటికీ, నాలుగో రోజు ప్రపంచవ్యాప్తంగా సినిమా రూ.6.1 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది.
దీంతో నాలుగు రోజుల ముగింపుకు ఈ చిత్రం మొత్తం రూ.67.2 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో, కేవలం నాలుగు రోజుల్లో రూ.67.2 కోట్ల గ్రాస్‌తో బ్లాక్‌బస్టర్ ప్రయాణం కొనసాగుతోంది అంటూ మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ సినిమాలు లేకపోవడం ‘లెనిన్’కు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. మరోవైపు పాజిటివ్ మౌత్ టాక్ కూడా సినిమాకు బలంగా నిలుస్తోంది. అయితే వీకెండ్‌తో పోలిస్తే సోమవారం కలెక్షన్లు గణనీయంగా తగ్గడం ట్రేడ్ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇక రాబోయే రోజుల్లో వసూళ్లు నిలకడగా కొనసాగితే రూ.100 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ క్లబ్ చేరడం పెద్ద కష్టమేమీ కాదని, లేదంటే ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.