Kriti Sanon | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. మహిళల ఆరోగ్యం, మాతృత్వం గురించి అవగాహన పెంచేలా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న కృతి.. ‘మిమి’ సినిమా షూటింగ్ సమయంలో తన అండాలను భద్రపరిచినట్లు తొలిసారిగా వెల్లడించారు. ఈ విషయాన్ని నేను ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదు. ‘మిమి’ సినిమా చేస్తున్న సమయంలోనే నా అండాలను ఫ్రీజ్ చేయించుకున్నాను. ఆ సినిమా కోసం బరువు పెరగాల్సి వచ్చింది. అందుకు ప్రత్యేక ఆహారం తీసుకోవాల్సి వచ్చేది. దాంతో శరీరంలో చాలా మార్పులు వచ్చాయి. కడుపు ఉబ్బరంగా ఉండేది. అయినా పాత్ర కోసం అవసరమైన మార్పులన్నీ అంగీకరించాను అని తెలిపారు.
ఆ సమయంలో షూటింగ్లో ఉన్న ఓ వ్యక్తి ఇచ్చిన సలహానే తన నిర్ణయానికి కారణమైందని కృతి చెప్పారు. ఎవరో ఒకరు నాకు.. ‘ఈ పని చేయగలిగితే నీకు నువ్వు ఇచ్చుకునే అత్యుత్తమ బహుమతి ఇదే’ అని చెప్పారు. ఆ మాట నా మనసులో బలంగా నాటుకుపోయింది. అప్పటికే సినిమా కోసం శారీరకంగా చాలా మార్పులు చేసుకుంటున్నాను కాబట్టి, ఇదే సరైన సమయం అనిపించింది. అందుకే అండాలను ఫ్రీజ్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాను అని వెల్లడించారు. ‘మిమి’ సినిమాలో కృతి సనన్ సరోగసీకి అంగీకరించే యువతి పాత్రలో నటించారు. ఆ పాత్ర కోసం ఆమె శరీర బరువును పెంచుకోవడంతో పాటు గర్భిణిలా కనిపించేలా ప్రత్యేకంగా సిద్ధమయ్యారు. పాత్రకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆమె తీసుకున్న కృషికి ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు లభించాయి. అదే సినిమాకు గాను కృతి జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా అందుకున్నారు.
తన వ్యక్తిగత నిర్ణయాన్ని ఎలాంటి సంకోచం లేకుండా అభిమానులతో పంచుకున్న కృతి సనన్కు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంచేలా ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ‘కాక్టెయిల్ 2’లో గ్లామరస్ పాత్రతో ఆకట్టుకున్న కృతి సనన్, ఇప్పుడు నిజాయితీగా చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె వెల్లడించిన ఈ విషయం మహిళల్లో ఎగ్ ఫ్రీజింగ్పై మరింత అవగాహన పెంచుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.