Komaram | మాస్ మహారాజా రవితేజ హీరోగా, దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని దూసుకుపోతోంది. విడుదలైన తొలి మూడు రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు చిత్రబృందం ప్రకటించగా, వీక్డేస్లోనూ సినిమాకు మంచి స్పందన వస్తుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన సక్సెస్ ప్రెస్మీట్లో నటుడు కొమరం చేసిన భావోద్వేగ ప్రసంగం అందరినీ కదిలించింది. తాను ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ, తన కెరీర్‌కు కొత్త గుర్తింపునిచ్చిన పాత్ర ‘ఇరుముడి’లోని నాగులు అని చెబుతూ కొమరం కన్నీటి పర్యంతమయ్యారు. దర్శకుడు శివ నిర్వాణ తనకు ఇచ్చిన అవకాశాన్ని జీవితాంతం మరిచిపోలేనని పేర్కొన్నారు. కొమరం మాటలు విన్న శివ నిర్వాణ కూడా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.
కొమరం మాట్లాడుతూ.. తాను సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 18 సంవత్సరాలు పూర్తయిందని తెలిపారు. గత 12 ఏళ్లుగా ‘కొమురక్క’ అనే లేడీ గెటప్‌లోనే ప్రేక్షకులకు ఎక్కువగా పరిచయమయ్యానని చెప్పారు. కొమురక్క గెటప్‌కు మంచి గుర్తింపు ఉంది. ఆ పాత్రను ప్రజలు ప్రేమించారు. కానీ అది నా అసలు వ్యక్తిత్వం కాదు.. నేను పోషించిన ఒక పాత్ర మాత్రమే. ‘వీడు లేడీ గెటప్పే చేస్తాడు’ అంటూ చాలా మంది నన్ను తక్కువ చేసి మాట్లాడారు. ఆ మాటలు ఎన్నోసార్లు బాధించాయి అంటూ కొమరం ఎమోషనల్ అయ్యారు.తనతో కలిసి ఉన్న స్నేహితుల్లో చాలామంది దర్శకులుగా ఎదిగారని, కానీ తనలోని మరో కోణాన్ని చూపించే అవకాశం మాత్రం ఎవరూ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు శివ నిర్వాణతో కుటుంబ సంబంధం లేదని, ముందుగా పెద్దగా పరిచయం కూడా లేదని కొమరం చెప్పారు. అయినప్పటికీ ‘ఇరుముడి’లో తనకు ఇంత కీలకమైన నాగులు పాత్రను ఇవ్వడం తన అదృష్టమని పేర్కొన్నారు.
శివ నిర్వాణ నా అన్న కాదు.. నా తమ్ముడు కాదు.. నాకు ముందు నుంచి పెద్ద పరిచయం కూడా లేదు. అయినా నాకు ఎందుకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చారో తెలియదు సార్. మూడు రోజులుగా నా ఫోన్ ఆగకుండా మోగుతోంది. అందరూ నాగులు పాత్ర గురించి మాట్లాడుతున్నారు. ఇంతకాలం నాకు రాని గుర్తింపు ఇప్పుడు వస్తోంది అంటూ భావోద్వేగానికి గురయ్యారు. సినిమా విడుదలైన తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పును చెబుతూ కొమరం చేసిన వ్యాఖ్యలు అందరి హృదయాన్ని తాకాయి. తన కుటుంబం కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉందని అన్నారు.నా భార్య కూడా మూడు రోజులుగా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను కొమురక్క మాత్రమే కాదు.. నాగులు గాడు అయిపోయాను సార్. అదంతా మీ పుణ్యమే. నా భార్య కూడా మీకు కృతజ్ఞతలు చెప్పమంది. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీ పాదాలకు వందనం చేస్తున్నా సార్ అంటూ కొమరం దర్శకుడు శివ నిర్వాణపై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.కొమరం మాటలకు అక్కడున్న చిత్రబృంద సభ్యులు చప్పట్లతో స్పందించారు. ఈ సమయంలో శివ నిర్వాణ కూడా భావోద్వేగాన్ని ఆపుకోలేక కంటతడి పెట్టుకున్నారు.
‘ఇరుముడి’ షూటింగ్‌కు మొదటి రోజు వచ్చినప్పుడు తన పాత్ర గురించి పూర్తి వివరాలు తెలియవని కొమరం తెలిపారు. తొలుత అది వేరే తరహా పాత్ర అని భావించానని, కానీ తర్వాత రవితేజతో ఫైట్ సీక్వెన్స్ ఉందని తెలిసినప్పుడు ఒక్కసారిగా టెన్షన్ పడ్డానని సరదాగా చెప్పారు. రవితేజ సార్‌తో ఫైట్ చేయాల్సి ఉంటుందని తెలిసిన వెంటనే చెమటలు పట్టేశాయి. కానీ సినిమా విడుదలైన తర్వాత ఆ సీన్ చూసి చాలా మంది ప్రశంసించారు. ఆ ఒక్క పాత్ర, ఆ ఒక్క సన్నివేశం నా కెరీర్‌పై కొత్త దృష్టి తీసుకొచ్చింది అని కొమరం పేర్కొన్నారు. సినిమా విడుదలైన తర్వాత ఏడు ప్రొడక్షన్ హౌస్‌ల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని కూడా ఆయన వెల్లడించారు. నాగులు పాత్ర తన కెరీర్లో కొత్త అవకాశాలకు తలుపులు తెరిచిందని సంతోషం వ్యక్తం చేశారు.