కరీనా, ప్రియాంక.. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇది బాలీవుడ్ మాట. అప్పట్లో ఈ ముద్దుగుమ్మలు కలిసి ‘ఐత్రాజ్’ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా నిర్మాణ సమయంలో వీరిద్దరూ సెట్లో పడి కొట్టుకున్నారని అప్పట్లో ఓ న్యూస్ బాగా వినపడింది. ఆ తర్వాత కూడా వీరిమధ్య అడపాదడపా గొడవలు జరిగాయని చెబుతుంటారు. ఎట్టకేలకు ఈ విషయంపై ఇన్నాళ్లకు స్పందించింది కరీనా. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడింది కరీనా.
‘ప్రియాంక, నేనూ కొట్లాడుకున్న మాట అవాస్తవం. మా ఇద్దరికీ ఎప్పుడూ గొడవ జరగలేదు. అప్పట్లో వృత్తిపరంగా మా మధ్య గట్టి పోటీ ఉండేది. ఇద్దరం నువ్వానేనా అనేలా నటించేవాళ్లం. తగ్గట్టే మాకు మంచి పాత్రలు దొరికాయి. మా పోటీని చూసి, మాపై కొందరు లేనిపోనివి సృష్టించి రాసేవారు. అవే నిజమని ఇప్పటికీ కొందరు నమ్ముతున్నారు’ అంటూ తన మనసులోమాట బయట పెట్టింది కరీనా. ఇంకా మాట్లాడుతూ ‘ సినిమా అంటేనే వైకుంఠపాళీ. ప్రతిసారీ ఇక్కడ గెలవలేం. ఒక్కోసారి ఘోరమైన ఓటములు ఎదురవుతాయి’ అని చెప్పుకొచ్చింది.