Kannada Actress Chaitra Achar | సోషల్ మీడియాలో తనకు ఎదురైన ఆన్లైన్ వేధింపులపై కన్నడ నటి, సింగర్, ‘సప్త సాగరాలు దాటి’ సినిమా ఫేమ్ చైత్ర జె. అచార్ తీవ్రంగా స్పందించారు. పోలీసు శాఖకు చెందిన వ్యక్తిగా భావిస్తున్న ఒక నెటిజన్ తనకు పంపిన అసభ్యకరమైన సందేశాలను ఆమె స్క్రీన్షాట్లతో సహా బయటపెట్టారు. ఈ విషయమై బెంగళూరు సిటీ పోలీసులను ట్యాగ్ చేస్తూ సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే చైత్ర అచార్, ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోషూట్ చిత్రాలను పంచుకున్నారు. అయితే, ‘మహేష్ హోసమని’ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి ఆమె ఫోటోలపై అత్యంత అసభ్యకరమైన కామెంట్లు వచ్చాయి. సదరు వ్యక్తి ప్రొఫైల్ పిక్చర్లో పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న ఫోటో ఉండటంతో నటి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఆ సందేశాల స్క్రీన్షాట్లను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేస్తూ, గౌరవనీయులైన బెంగళూరు సిటీ పోలీస్, ఈ వ్యక్తి మీ శాఖకు చెందినవాడేనని భావిస్తున్నాను, ఆయన అడిగిన ఈ అసభ్యకరమైన ప్రశ్నకు దయచేసి సమాధానం ఇవ్వగలరా అంటూ చైత్ర ప్రశ్నించారు.
తమ చాటింగ్‌ను నటి బహిర్గతం చేయడంతో సదరు వ్యక్తి ఒక్కసారిగా దిగొచ్చాడు. చైత్రకు క్షమాపణలు చెబుతూ మరో సందేశం పంపాడు. తాను పొరపాటున అలా చేశానని, తానేమీ చెడ్డవాడిని కాదని, పైగా ఆమెకు పెద్ద అభిమానిని అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఆ పోస్ట్‌ను డిలీట్ చేయాలని, లేదంటే తన ఉద్యోగానికి ముప్పు వస్తుందని బ్రతిమాలాడు. అయితే, నటి చైత్ర ఆ క్షమాపణల సందేశాన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ గట్టిగా నిలదీశారు. తప్పు చేసేటప్పుడు లేని భయం, ఇప్పుడు ఉద్యోగం పోతుందనగానే వచ్చిందా అని ఆమె ప్రశ్నించారు. సినిమా ఇండస్ట్రీలో ఉండే మహిళల పట్ల, నటీమణుల పట్ల కొందరు చూపే ద్వంద్వ నీతిని ఆమె ఎండగట్టారు. సాధారణంగా ఇలాంటి కామెంట్లను చాలామంది లైట్ తీసుకుంటారు, కానీ చైత్ర మాత్రం వెనక్కి తగ్గకుండా నేరుగా స్పందించి నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నారు.
కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న చైత్ర అచార్, ప్రస్తుతం ఇతర భాషల్లోనూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’ లో ఆమె ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.