నిర్మాతగా భారీ విజయాల్ని సొంతం చేసుకున్న ఎం.ఎస్.రాజు.. దర్శకుడిగా కూడా రాణిస్తున్నారు. తాజాగా ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’. ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది. ఓ చీకటి గుహలో 12 చేతులతో కూడిన ఓ భారీ విగ్రహం ముందు విభిన్న వేషధారణలో నిలుచున్న ఓ అమ్మాయి ఎవరని ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. సోమవారం ఆ క్యారెక్టర్ గురించిన వివరాలను వెల్లడించారు.
ఈ సినిమాలో కథానాయికగా కామాక్షి భాస్కర్ల నటిస్తున్నదని, మహాదేవిగా ఆమె పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో కామాక్షి భాస్కర్ల నల్లరంగు చీరకట్టుకొని గంభీరంగా కనిపిస్తున్నది. సంప్రదాయం, అధ్యాత్మికత, మార్మికత కలబోతగా ఆమె పాత్ర భిన్న పార్శాలో సాగుతుందని తెలిసింది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కిన్ అరుల్ దేవ్, నిర్మాణ సంస్థ: శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్, నిర్మాత: కాశీ విశాలాక్షి బలుసు, రచన-దర్శకత్వం: ఎమ్మెస్ రాజు.