‘మా అన్నయ్య కీరవాణి స్వరపరిచిన ‘నాటు నాటు’ పాట ఆస్కార్ బరిలో నిలవడం ఎంతో ఆనందంగా వుంది. రాజమౌళికి తన సినిమా మీద, ఆ పాట మీద వున్న నమ్మకమే అక్కడి వరకు తీసుకెళ్లింది’ అన్నారు సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్. సంగీత దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమార్క్ను క్రియేట్ చేసుకున్న కల్యాణి మాలిక్ తాజాగా సంగీత దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి’. నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ అవసరాల దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ నెల 17న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో బుధవారం విలేకర్లతో ముచ్చటించిన సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్ ఈ చిత్రం గురించి, తన సినీ ప్రయాణం గురించి ఎన్నో విశేషాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ “చెక్’ సినిమా తరువాత కోవిడ్ కారణంగా కాస్త విరామం వచ్చింది. కానీ 2022 ద్వితీయార్థం నుంచి జీవితంలో ఎప్పుడూ లేనంత సంతోషంగా వున్నాను. ‘ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి’ తో పాటు ఇంటింటి రామాయణం, విద్య వాసుల అహం చిత్రాలు విడుదల కాబోతున్నాయి. మరో రెండు వెబ్ సిరీస్‌లు చేస్తున్నాను. ప్రస్తుతం వర్క్ పరంగా సంతృప్తిగా వున్నాను. ఈ చిత్రంలోని పాటలు బాగున్నాయి అని ప్రశంసలు దక్కాయి.ఈ సినిమాకి లిరిక్ రైటర్‌గా లక్ష్మీభూపాల్ గారు, సింగర్‌గా ఆభాస్ జోషి అవార్డులు అందుకుంటారనే నమ్మకం వుంది. అయితే అవార్డుల కంటే కూడా నా పాట బాగుందని పేరే నాకు ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది.
అవకాశాలు రాలేదు
సినిమా విజయం తరువాత అవకాశాలు పెరుగుతాయనే అందరూ ఆశిస్తారు. కానీ నా విషయంలో దానికి విరుద్ధంగా జరుగుతుంది. ఏ హిట్ వచ్చినా ఆ తరువాత దానికి తగ్గ అవకాశం రాలేదు. ఐతే, అష్టాచెమ్మా, అలా మొదలైంది. ఇలా ఏ సినిమా తీసుకున్నా నేను ఊహించిన విధంగా కెరీర్ లేదు. అయితే దానికి కారణమేంటి అని ఆలోచించడం కన్నా ఇంకా బాగా కష్టపడాలి అనే దృష్టితో పనిచేసుకుంటూ వెళుతున్నాను. నా ఇరవై ఏళ్ల కెరీర్లో ఇది నా 19వ సినిమా. ఈ ప్రయాణంలో నా సంగీతం పట్ల ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఆ విషయంలో ఆనందంగా వున్నాను.
ఎవర్గ్రీన్ కాంబినేషన్స్
రాజమౌళి-కీరవాణి, సుకుమార్-దేవిశ్రీప్రసాద్‌ల కాంబినేషన్లు నాకు చాలా ఇష్టం. ఆ కాంబినేషన్లు అలా ఉంటేనే బాగుంటాయి. రాజమౌళి సినిమాలకు అన్నయ్య అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నప్పుడు.. ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారని ఆలోచించడం అనవసరం. అలాగే సుకుమార్ గారంటే చాలా ఇష్టం. సుకుమార్ రైటింగ్స్‌లో ఆయన నిర్మించే సినిమాకి నేను సంగీతం అందించాలని కోరుకుంటాను. కానీ ఆయన దర్శకత్వం వహించే సినిమాకి సంగీతం అందించాలని కోరుకోను.