Janhvi Kapoor | ‘అమ్మ వదిలివెళ్లాక ఆ స్థానం నా చెల్లెలు ఖుషి తీసేసుకుంది. అమ్మలేని లోటు ప్రస్తుతం నాకు లేదు’ అంటూ ఎమోషనల్గా మాట్లాడింది జాన్వీకపూర్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన చెల్లెలు ఖుషీకపూర్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది జాన్వీ. ‘నాది అమ్మ పోలిక.. ఖుషీది మా అమ్మమ్మ పోలిక. అందుకే ఖుషీ అంటే అమ్మకు ఎక్కువ ఇష్టం. ‘ఇది మా అమ్మ’ అంటూ ఎప్పుడూ అంటూ ఉండేది. ఇప్పుడు అమ్మ లేదు. అమ్మ పోలికలతో ఉన్న నాకు అమ్మమ్మ పోలికలతో ఉన్న ఖుషి అమ్మ అయింది.
ఇదే యాదృచ్ఛికం అంటే. మా ఇద్దరి ఇష్టాయిష్టాలు అమ్మకు బాగా తెలుసు. అందుకే ఏ విషయంలోనూ మాకు లోటుండేదికాదు. ఇప్పటికీ నాకు ఏ విషయంలోనూ లోటులేదు. దానికి కారణం ఖుషి. అయితే.. తన ఇష్టాయిష్టాలు నాకు తెలీదు. నిజం చెప్పాలంటే నేను తనని పట్టించుకోను. కానీ తను విశాలంగా ఆలోచించే మనిషి. నాకంటే మూడేళ్లు చిన్నదైనా తనకు పరిపక్వత ఎక్కువ. అందుకే తనెప్పుడూ బాగానే ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది జాన్వీకపూర్.