Irumudi | మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా రవితేజ అయ్యప్ప స్వామి మాలలో కనిపించడం, టీజర్, ట్రైలర్లో చూపించిన ఇంటెన్స్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. దీంతో ఇటీవల కాలంలో రవితేజ సినిమాలకు కనిపించని స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నమోదయ్యాయి. పాజిటివ్ బజ్ మధ్య విడుదలైన ఈ సినిమా అమెరికాలో ప్రీమియర్ షోలు ఇప్పటికే పూర్తయ్యాయి. అక్కడి నుంచి వస్తున్న సోషల్ మీడియా రెస్పాన్స్ ప్రకారం ‘ఇరుముడి’కి మంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సాధారణ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే అంచనాలతో వెళ్లిన ప్రేక్షకులకు సినిమా ఊహించని రీతిలో సామాజిక అంశాలను కూడా స్పృశిస్తూ సాగుతుందని తెలుస్తోంది.
టీజర్, ట్రైలర్ చూసినప్పుడు ‘ఇరుముడి’లో డివోషనల్ టచ్‌తో కూడిన ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయని ప్రేక్షకులు భావించారు. అయితే సినిమా చూసిన ఎన్ఆర్ఐ ప్రేక్షకులు మాత్రం ఇది కేవలం రొటీన్ ఫ్యామిలీ డ్రామా కాదని సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. కథలోని ప్రధాన అంశాన్ని ఏమాత్రం పక్కదారి పట్టించకుండా దర్శకుడు శివ నిర్వాణ నిజాయితీగా తెరకెక్కించారని ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ఇంట్లో ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులను ఈ సినిమా తప్పకుండా ఆలోచింపజేస్తుందని చెబుతున్నారు. పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రుల ఆలోచనా విధానంపై సినిమా చర్చిస్తుందని, పేరెంటింగ్ స్టైల్‌పై కూడా ప్రభావం చూపే కంటెంట్ ఇందులో ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సినిమా ప్రమోషనల్ కంటెంట్‌లో తండ్రి-కుమార్తె మధ్య అనుబంధాన్ని ప్రధానంగా చూపించినప్పటికీ, సినిమాలో ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ కూడా కీలకంగా ఉంటుందని ప్రీమియర్ టాక్ ద్వారా తెలుస్తోంది. ఫస్టాఫ్‌లో ఈ ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయట. అదే సమయంలో కథలో సస్పెన్స్, థ్రిల్ అంశాలను కూడా శివ నిర్వాణ ఆసక్తికరంగా మేళవించారని అంటున్నారు. తండ్రీ కొడుకుల మధ్య బంధం, అమ్మాయిల పెంపకం విషయంలో సాయి కుమార్ చెప్పే డైలాగులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో పాటు ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా బాగా వర్కౌట్ అయిందనే టాక్ వినిపిస్తోంది.
ఫస్టాఫ్ సస్పెన్స్, థ్రిల్‌తో సాగితే సెకండాఫ్‌లో ఎమోషనల్ డ్రామాకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని తెలుస్తోంది. కథలో వచ్చే కీలక ట్విస్ట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుందట. అయితే ఆ ట్విస్ట్ బయటపడిన తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలను ఇంకాస్త బలంగా రాసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే రొటీన్ కమర్షియల్ ఫార్ములాను పక్కనపెట్టి ఎమోషనల్ క్లైమాక్స్‌తో సినిమాను ముగించిన తీరు ఆకట్టుకుందని సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. తనదైన స్టైల్లో భావోద్వేగాలను తెరపైకి తీసుకురావడంలో శివ నిర్వాణ మరోసారి సక్సెస్ అయ్యారనే అభిప్రాయం వినిపిస్తోంది.
‘ఇరుముడి’లో సంగీతం కూడా సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని ప్రీమియర్ చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో ‘మల్లెపూల పల్లకి’ పాట వచ్చే సందర్భం థియేటర్లలో మంచి హై ఇచ్చేలా ఉందట. ఆ సీక్వెన్స్‌కు ప్రేక్షకుల నుంచి విజిల్స్, చప్పట్లు రావడం ఖాయమని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.