Vijay Antony | బిచ్చగాడు సిరీస్‌తో విజయ్‌కు తెలుగులో మంచి క్రేజ్ తో పాటు మార్కెట్ బాగానే పెరిగింది. రీసెంట్ గా రిలీజైన బిచ్చగాడు-2నే దానికి నిదర్శనం. రెండు నెలల క్రితం రిలీజైన బిచ్చగాడు సీక్వెల్ మిక్స్డ్ టాక్ తోనే ఇక్కడ కోట్లు కొల్లగొట్టింది. బయ్యర్లకు కళ్లు చెదిరే లాభాలు తెచ్చిపెట్టింది. ఇందులో మరో ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే బిచ్చగాడు తమిళ వెర్షన్ కంటె తెలుగులోనూ ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే బిచ్చగాడు సిరీస్ కు ఇక్కడ ఏ స్థాయిలో క్రేజ్ ఉందో తెలుస్తుంది. ఇక రెండేళ్లలో బిచ్చగాడు పార్ట్-3 కూడా రిలీజ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించాడు. బిచ్చగాడు-2 క్రేజ్ తో విజయ్ తాజాగా నటించిన హత్య సినిమాను సైతం తెలుగులో భారీ స్థాయిలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రయిలర్ గట్రా ఈ సినిమాపై మంచి బజ్నే క్రియేట్ చేశాయి. ఈ సినిమా జూలై 21న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా ఫైనల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
రీసెంట్ గా రిలీజైన ఫైనల్ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. రెండొందలకు పైగా కేసులకు సాల్వ్ చేసిన డిటెక్టీవ్ వినాయక్ అలియాస్ విజయ్ ఆంటోనికి హత్యకు గురైన మోడల్ మీనాక్షీ(లీలా) కేసును అప్పగిస్తారు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా క్లూస్ రాబడుతూ హత్య వెనకున్న మిస్టరీని చేదిస్తూ ఉంటాడు. మరి చివరికి ఎవరు హత్య చేశారన్నది విజయ్ ఆంటోని కనుక్కున్నాడా? అసలు మీనాక్షీని ఎందుకు చంపారు? ఎవరు చంపారు? అనే ప్రశ్నలన్నిటికి మరో రెండు రోజుల్లో సమాధానం దొరకనుంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ ఆంటోని అసిస్టెంట్ గా రితికా సింగ్ నటించింది. ట్రైలర్ కాస్త ఎంగేజింగ్ గానే ఉంది.
ముఖ్యంగా ట్రైలర్లో గిరీష్ గోపాలకృష్ణ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. బాలాజీ కే కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఇన్ఫినిటి ఫిలింస్ వెంచర్స్, లోటస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. రాధికా శరత్ కుమార్, మురళి కృష్ణ కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. నిజానికి ఈ సినిమా బిచ్చగాడు కంటే ముందే విడుదల కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.