బాసింగ బాసింగా బలాలే బలువున్నాయే!
పెళ్లి కొడుకు నుదుట కడదామంటే బాసింగాలు కనబడలేదు. ఇప్పట్లాగా ‘బాసింగ బాసింగా బలాలే బలువున్నాయే’ అని పాడకపోయినా అవి సిలబస్‌లో భాగమే కదా! వెంటనే చుట్టాలలో కొందరు ఎక్కడ ఏదున్నా వెతికి పెట్టే ఎక్స్పర్టులు రంగంలోకి దూకారు. వెతికీ, వెతికీ ఎక్కడివాళ్లక్కడ కూలబడిపోయినా ఫలితం లేదు.
రమాయనం, ద గ్రాండ్ మ్యారేజ్
మొదటిసారి ఒక గ్రాండ్ మ్యారేజ్‌ని చూసింది నా పన్నెండేళ్ల వయసులో. అమ్మవైపు మా కజిన్స్లో మొట్టమొదటి పెళ్లి 1971లో విజయమ్మ వదినది. ఆ పెళ్లి కూడా ఎంతో వైభవంగానే అయింది. అయితే, ఆ తర్వాత మూడేళ్లకు హైదరాబాదులో మార్చి 14న ఆనంద్ అన్నయ్య పెళ్లి మాత్రం నెక్ట్స్ లెవెల్ అన్నమాట.
నేను అప్పటివరకూ చూసిన పెళ్లిళ్లన్నీ ఒకెత్తు, ఇదొక ఎత్తు. నేనప్పుడు నైంత్ క్లాస్. అప్పటికి చదువుల్లో ఇంత ఒత్తిడి లేదు గనుక నేను ఇష్టానుసారంగా వారం రోజులు బడి ఎగ్గొట్టేశాను. పాఠాలు చదువుకోవచ్చు గానీ, దగ్గరివాళ్ళ పెళ్లిళ్లు మాటిమాటికీ రావుగా!
అమ్మా, నేనూ, అక్కా ముందుగానే హైదరాబాదుకు వెళ్లాం. గౌలిగూడలో మూడంతస్తుల్లో ఉన్న ఆ ఇంటికి రంగులేయడంతో ఎంతో కళ వచ్చింది. బయట గోడలకు అంత పొడవునా చిన్నచిన్న బల్బుల తోరణాలు వేలాడదీయడం, అవి జిగేలుమని పై నుంచి కిందకు జాలువారడం చూసి… నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయాను. అన్నన్ని లైట్లు చూడటం అదే మొదలు! ఇక మా పిల్లల బ్యాచ్ ఆటలకైతే లెక్కే లేదు. ఆడపిల్లలమంతా ఒక జట్టుగా చేరి ముచ్చట్లు, పాటలు, ఆటలు, నవ్వులు, బొమ్మల పెళ్లిళ్లు, దగ్గర్లో ఉన్న కంగన్ హాల్‌కు వెళ్లి రకరకాల హెయిర్ క్లిప్పులు, రిబ్బన్లు, గాజులు, పిన్నులు, గోళ్ల రంగులు, ఒకటేమిటి.. ఎన్నో కొన్నాం. అందరివీ కలిస్తే ఒక షాపు పెట్టేటన్ని కూడాయి. డబ్బులు పద్మ చిన్నమ్మే ఇచ్చినట్టు జ్ఞాపకముంది.
పెళ్లికి ముందు రోజు సాయంత్రం అంతా రెడీ అయ్యాక పెళ్లి కొడుకు నుదుట కడదామంటే బాసింగాలు కనబడలేదు. ఇప్పట్లాగా ‘బాసింగ బాసింగా బలాలే బలువున్నాయే’ అని పాడకపోయినా అవి సిలబస్‌లో భాగమే కదా! వెంటనే చుట్టాలలో కొందరు ఎక్కడ ఏదున్నా వెతికి పెట్టే ఎక్స్పర్టులు రంగంలోకి దూకారు. వెతికీ, వెతికీ ఎక్కడివాళ్లక్కడ కూలబడిపోయినా ఫలితం లేదు. కొనుక్కొచ్చినాంక ఎక్కడ పెట్టిన్రో యాదికి చేసుకోండి! ఉంటయి ఎక్కడ్నో ఒక దగ్గర!
బాసింగాలు మంచిగ పెట్టుకోరా! ఇప్పుడు జూడండి ఎంత తిప్పలు అయితున్నదో! మళ్ల కొనుక్కరావాల్నన్నా బొచ్చెడు దూరం పోవాలె, టైం లేదాయె! అయినా నిన్న పెండ్లి కొడుకును జేసినప్పుడు మంత్రం జదివి కట్టినవాయే! గిప్పుడు కొత్తయి ఎట్ల కడతం? మంచిగ ఎతుకండి, అవ్వే దొరుకుతయి. నాకు తెచ్చిచ్చినా అయిపోవు, పదిలంగ పెడుదును ఎక్కడ్నన్న! ఇట్లా ఎవరికి తోచిన మాటలు వాళ్లు మాట్లాడుతూనే ఉన్నారు. ఆ మాటల వల్ల ఏమీ ఫలితం ఉండదని అందరికీ తెలుసు. పద్మ చిన్నమ్మకు చికాకు, అసహనం పెరిగిపోతున్నాయి. ఇక రంగంలోకి స్పెషల్ స్క్వాడ్ క్లూస్ టీమ్ దిగక తప్పలేదు. హైమక్క ఇలాంటివి పసిగట్టడంలో దిట్ట. మెల్లిగా గిరిజను పిలిచింది. పెళ్లికొడుకు ఆనంద్ అన్నయ్యకు ఆఖరి చెల్లెలు గిరిజ నాలుగేళ్ల పిల్ల. గిరీ! నీ బొమ్మలల్ల గిట్లాటిది ఉన్నదా? చూసి చెప్పు నాన్నా! అని అడగ్గానే గిరిజ ఎంతో ఉత్సాహంగా అవును, జంపఖానల ఉంటె చూసి బొమ్మల కోసం మంచిగుంటయని తీసుకున్న. ఇగో! అని తీసుకొచ్చి చూపించింది. బాసింగాలు దొరికినాయనే వార్త పెళ్లింట్లో బ్రేకింగ్ న్యూస్‌లా పాకిపోయింది. చిన్నమ్మ వెంటనే గిరిజను పక్కకు పిలిచి ప్రైవేట్ క్లాసు తీసుకోవడం, దాన్ని వాళ్ల నాన్న పెద్దోళ్లు చూసుకోవాలె గానీ, దానికేం తెలుస్తది, చిన్న పిల్ల! అని రెస్క్యూ చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి.
మొత్తానికి కొందరు కార్లల్లోనూ, మిగతా వాళ్లమందరం రెండు బస్సుల్లోనూ పెళ్లి హాల్‌కి బయల్దేరాం. హిమాయత్ నగర్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కొన్ని క్వార్టర్స్‌లో మాకు విడిది. అక్కడే ఓ విశాలమైన హాలులో పెళ్లి. మా వాళ్లలో చాలామందికి పూలదండలు వేసి, ఆడవాళ్లకయితే అత్తరు గంధాలు పూసి, పన్నీరు చల్లి ‘ఎదురుకోళ్లు’ కార్యక్రమంలో వదిన తరఫువాళ్లు ఎంతో బాగా రిసీవ్ చేసుకున్నారు. వదిన పేరు సునంద. ఆడవాళ్లంతా పట్టుచీరలు, నగలు, పువ్వులు, రకరకాల అలంకరణలతో కనిపించారు. మగవాళ్లలో ఎక్కువ మంది ధోవతులే కట్టుకున్నారు. పెళ్లి చాలా గ్రాండ్‌గా చేశారని అందరూ అనుకున్నారు.
ఆ పెళ్లిలో మాకు సంగీత, పునీత, వాళ్లన్నయ్య ప్రశాంత్ బాగా స్నేహితులయ్యారు. వాళ్లు వదిన మేనత్త పిల్లలు. సంగీత మాటిమాటికీ ‘రేపల్లె వేచెనూ.. వేణువు వేచెనూ.. వనమెల్ల వేచేనురా, నీ రాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధ వేచేనురా!’ అనే పాట హమ్మింగ్ చేయడం, ప్రశాంత్ వెంటనే అక్కడ దూరంగా ఎవరొస్తే వాళ్లను చూపించి ‘అగో, వేచావుగా.. నీ కృష్ణుడొచ్చాడు చూడు’ అని ఏడిపించడం, ‘అన్నయ్యా! నిన్ను కొడతాను చూడు’ అని ఆమె అనడం.. ఇదంతా చూసి అన్నలు చెల్లెళ్లని బనాయించడం ఏమిటని నాకు ఆశ్చర్యం కలిగింది. ఆ పెళ్లిలో దొరికిన మరో ఫ్రెండ్ కల్పన. సునంద వదిన మేనమామ కూతురు. బుజ్జి అనేవారు. మా లక్ష్మి ఎవరితోనైనా వెంటనే ఫ్రెండ్షిప్ చేసుకుని వాళ్లతో కలిసిపోయేది. మమ్మల్ని కూడా లాక్కుపోయేది.
సాయంత్రం పెళ్లి కొడుకునీ, పెళ్ళికూతుర్నీ బడీ చౌడీలోని హనుమాన్ గుడికి తీసుకొచ్చారు. ఇక అక్కడి నుండి చూడాలి హంగామా! సినిమాల్లోలాంటి ఎర్రటి పెద్ద ఓపెన్ టాప్ ఇంపాలా కారు వచ్చింది. దాన్ని మొత్తం పూల దండలతో అలంకరించారు. దాంట్లో పెళ్ళికొడుకు, పెళ్లి కూతురు కూర్చోగానే బ్యాండ్ వాళ్ళు దిక్కులు దద్దరిల్లేలా పెద్దగా వాయించడం మొదలుపెట్టారు. వాళ్ళంతా ఎర్రటి డ్రెస్సులు వేసుకుని రకరకాల వాద్యాలపై తెలుగు, హిందీ పాటలు అద్భుతంగా పాడారు. దేవదూతల్లా తెల్లటి మెరుపుల వస్ర్తాలు ధరించిన అమ్మాయిలు బ్యాటరీతో నడిచే మెర్క్యూరీ లైట్స్‌ని కారు ముందర రెండు వైపులా హారాల్లాగా పట్టుకుని నడవసాగారు. ప్రీతమ్ సింగ్ బ్యాండ్ ఇది. మొత్తం సిటీల్నే శానా ఫేమస్! ‘బారాత్’ అన్న మాట వినడం ఇదే మొదలు నాకు.
– నెల్లుట్ల రమాదేవి, రచయిత్రి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

