Hari Hara Veeramallu | పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా హరి హర వీరమల్లు భారీ అంచనాల మధ్య జూలై 24న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకి మంచి ఆదరణే లభించింది. ఈ క్రమంలో హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు పవన్ కళ్యాణ్. అయితే చిత్రంలోని కొన్ని సీన్లపై ఆడియెన్స్ నుంచి నెగెటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఉన్న హార్స్ రైడింగ్ సీన్లు, వీఎఫ్ఎక్స్ వర్క్ పట్ల అసంతృప్తి వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని సన్నివేశాలను కట్ చేస్తూ నిడివిని తగ్గించారు.
సెకండాఫ్‌లోని హార్స్ రైడింగ్, తోడేలు తదితర సీన్లను పూర్తిగా తొలగించారని సమాచారం. ముఖ్యంగా కోహినూర్ వజ్రం కోసం జర్నీకి సంబంధించిన భాగాలను కట్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం మీద సినిమాకు 2 గంటల 42 నిమిషాల నిడివి ఉండగా, ఇప్పుడు దాన్ని 2 గంటల 22 నిమిషాలకు ట్రిమ్ చేశారు. ఈ మార్పులతో గురువారం రాత్రి నుంచే అన్ని థియేటర్లలో షోస్ నడిచాయి. ఇక మూవీకి మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేయగా, ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సోషల్ మీడియా ట్రోల్స్, నెగటివ్ కామెంట్స్‌ను పట్టించుకోవద్దని తెలిపారు. “విమర్శలు వస్తే, మన స్థాయిని గుర్తు చేస్తున్నట్టే,” అని అభిప్రాయపడ్డారు. విమర్శలను ఎదుర్కొని, అభిమానుల జోష్‌ను పెంచేలా మాట్లాడారు. జీవితం ఆనందంగా గడపాలి అనే సందేశం కూడా ఇచ్చారు.
జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన హరిహర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా, అనసూయ ఓ ప్రత్యేక పాటలో కనిపించారు. బాబీ డియోల్ ఔరంగజేబ్ పాత్రలో మెప్పించగా, సునీల్, రఘుబాబు, నాజర్ కీలక పాత్రలు పోషించారు. నిర్మాత ఏఎం రత్నం ఈ మూవీని సమర్పించారు. కీరవాణి అందించిన సంగీతం సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అయింది. ప్రస్తుతం కొత్త ఎడిటెడ్ వెర్షన్ థియేటర్లలో ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో ప్రేక్షకులకి ఇది ఒక విధంగా కొత్త అనుభూతి ఇవ్వనుందని అంటున్నారు.