టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా, వెర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి, టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘గాయపడ్డ సింహం’. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, వైవిధ్యమైన కథాంశంతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఆడియన్స్‌ను ఎంతవరకు మెప్పించిందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ
దరహాస్ (తరుణ్ భాస్కర్) ఒక సాదాసీదా యువకుడు. తను ప్రేమించిన అమ్మాయి తండ్రికి ఒక కండిషన్ ఉంటుంది.. తన కూతురిని అమెరికాలో సెటిల్ అయిన వాడికే ఇచ్చి పెళ్లి చేస్తానని. దీంతో ఎలాగైనా అమెరికా వెళ్లాలని దరహాస్ నిర్ణయించుకుంటాడు. కానీ, అక్కడ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారతీయులను డిపోర్టేషన్ (తిరిగి పంపించడం) చేయడంతో దరహాస్ ప్లాన్ రివర్స్ అవుతుంది. దీనికి ట్రంప్ కారణమని భావించిన దరహాస్, ఆయనపై పగ తీర్చుకోవడానికి ‘చేతబడి’ చేయాలని వింత నిర్ణయం తీసుకుంటాడు. ఇందుకోసం క్షుద్ర విద్యల నేపథ్యం ఉన్న ఫ్యామిలీకి చెందిన ఐఏఎస్ అస్పిరెంట్ భైరవ్ దాస్ (శ్రీ విష్ణు) సాయం కోరతాడు. వైట్ హౌస్ నుంచి ట్రంప్ తాలూకు వెంట్రుకలను తెప్పించి, గ్యాంగ్ స్టర్ బ్రూతల్ ధర్మ (జేడీ చక్రవర్తి) లాజిస్టిక్స్ ద్వారా ఇండియాకు చేరవేసే క్రమంలో చోటుచేసుకున్న వింత పరిణామాలు, కామెడీ సన్నివేశాలే ఈ చిత్ర కథ.
విశ్లేషణ
దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ ఈ సినిమాను ఎక్కడా సీరియస్‌గా తీసుకోకుండా, పూర్తి స్థాయి కామెడీ జోనర్లో నడిపించారు. ట్రంప్‌పై చేతబడి చేయడం అనే పాయింట్ వినడానికి విడ్డూరంగా ఉన్నా, దాని చుట్టూ అల్లిన సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. ‘బొమ్మరిల్లు’, ‘పోకిరి’, ‘అర్జున్ రెడ్డి’ వంటి ఐకానిక్ సినిమాలపై వేసిన సెటైర్లు, ప్యారడీ సీన్స్ యువతను బాగా ఆకట్టుకుంటాయి.
టెక్నికల్ అంశాలు: సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. నేపథ్య సంగీతం కథలోని ఫన్ను ఎలివేట్ చేసింది. అయితే, అమెరికా అధ్యక్షుడికి సంబంధించిన వస్తువులను ఇండియాకు తీసుకురావడం వంటి అంశాల్లో లాజిక్స్ వెతికితే నిరాశ తప్పదు. దర్శకుడు ముందే చెప్పినట్లు ఇది కేవలం వినోదం కోసమే తీసిన సినిమా.
నటీనటుల ప్రతిభ
తరుణ్ భాస్కర్ దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ తనదైన ఈజ్ చూపించారు. ప్రేమికుడిగా, ట్రంప్ బాధితుడిగా ఆయన నటన నేచురల్‌గా ఉంది. ‘బ్రూతల్ ధర్మ’గా జేడీ తన పాత రోజులను గుర్తు చేశారు. సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఒదిగిపోయారు. భైరవ్ దాస్ పాత్రలో శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ అద్భుతం. క్షుద్ర మాంత్రికుల ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చే సీన్స్ సినిమాలో హైలైట్. హీరోయిన్గా ఫరియా తన క్యూట్ లుక్స్‌తో మెప్పించడమే కాకుండా, పరిధి మేరకు చక్కగా నటించింది. శుభలేఖ సుధాకర్, హర్షవర్ధన్ తమ అనుభవంతో పాత్రలకు న్యాయం చేశారు.
ప్లస్ పాయింట్స్:
తరుణ్ భాస్కర్, శ్రీ విష్ణు, జేడీ చక్రవర్తిల నటన.
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గ్లామర్.
అక్కడక్కడా పేలిన పేరడీ కామెడీ.
నేపథ్య సంగీతం, నిర్మాణ విలువలు.
మైనస్ పాయింట్స్:
కథలో లాజిక్ లేకపోవడం.
సెకండాఫ్ లో కొన్ని సాగదీత సీన్లు.
తీర్పు:
‘గాయపడ్డ సింహం’ కేవలం వినోదాన్ని ఆశించే ప్రేక్షకులకు మంచి ఛాయిస్. లాజిక్‌ను ఇంటి దగ్గరే వదిలేసి, థియేటర్లో కేవలం నవ్వుకోవాలనుకుంటే ఈ సినిమాను తప్పక చూడొచ్చు.
పంచ్ లైన్: గాయపడ్డ సింహం.. నో లాజిక్.. ఓన్లీ ఫన్నీ మ్యాజిక్!
రేటింగ్: 3/5