‘టైటిల్ విన్నప్పట్నుంచే ఈ సినిమాపై ఆసక్తి మొదలైంది. ఇది అందరికీ సంబంధించిన కథ. వీసా విషయంలో నేను కూడా ఫేస్ చేసిన అంశాలు ఇందులో ఉన్నాయి. ‘ఆకాశంలో ఒక తార’ షూట్ టైమ్‌లో మా డైరెక్టర్ పవన్ సాధినేని ఈ సినిమా గురించి చెప్పేవాడు. అందరూ ఇది చిన్న సినిమా అంటున్నారు. కానీ ట్రైలర్ చూస్తే అలా లేదు. ఇది సమ్మర్ బ్లాక్‌బస్టర్ కావడం ఖాయం’ అని అగ్ర హీరో దుల్కర్ సల్మాన్ నమ్మకంగా చెప్పారు.
తరుణ్ భాస్కర్ హీరోగా రూపొందిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘గాయపడ్డ సింహం’. జేడీ చక్రవర్తి కీలక పాత్రధారి. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకుడు. చక్రవర్తి మంతిన, భానుకిరణ్ ప్రతాప, విజయ్‌కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ నిర్మాతలు. పవన్ సాధినేని సమర్పకుడు. మే 1న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శనివారం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దుల్కర్ సల్మాన్ పై విధంగా స్పందించారు.
దిల్ రాజు విడుదల చేయడం సినిమాకు పెద్ద ఎస్సెట్ అని జేడీ చక్రవర్తి అభిప్రాయపడ్డారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘సినిమా రీసెంట్గా చూశా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇందులో హీరోనే. మంచి కాన్సెప్ట్. అప్పటి ‘మనీ’, మొన్నటి ‘జాతిరత్నాలు’ తరహాలో చిన్న పాయింట్‌తో అందర్నీ నవ్వించాడు దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్. ప్రభాస్, మహేశ్, సిద్ధార్థ్, యష్, దేవరకొండ విజయ్ ఇలా అగ్రహీరోలంతా ఇందులో భాగమయ్యారు. అదెలాగో సినిమా చూస్తే తెలుస్తుంది. ఆ ఎపిసోడ్‌ని మీరు ఎంజాయ్చేస్తే ఇది మరో ‘మనీ’. మరో ‘జాతిరత్నాలు’. కచ్చితంగా అందరూ ఎంజాయ్ చేసే నవ్వుల ప్రయాణం ఈ సినిమా’ అని పేర్కొన్నారు. ఇంకా చిత్రబృందమంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.