రామాయణం.. వాల్మీకి రాస్తుంటే జరిగిందా?.. లేక జరుగుతున్న రామాయణాన్ని చూస్తూ వాల్మీకి రాశాడా? అనేది అంతుపట్టని ప్రశ్నలు. ఆయన ఎలా రాసినా.. ఎప్పుడు రాసినా.. ఇప్పటికీ రామాయణ మహాకావ్యంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. రాముడు వైకుంఠనారాయణుడని నమ్మిన వాళ్ల అభిప్రాయం ఒకలా ఉంటే.. రాముడు కేవలం రాజు మాత్రమే అనే వాళ్ల వాదన మరోలా ఉంది. ఏది ఏమైనా ఒక కావ్యం నుండి ఒక దైవం పుట్టుకురావడం.. ఒక సంస్కృతి పుట్టుకురావడం.. ఒక ధర్మం పుట్టుకురావడం.. సాధారణమైన విషయం కాదు. రామభక్తి ప్రభావం వల్ల ఈ దేశం పునీతమైందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.
రామభక్తి వల్లే త్యాగరాజస్వామి 72 మేళకర్త రాగాలను సృజించగలిగారు. ఆ మేళకర్త రాగాల నుండే అనంతమైన జన్యురాగాలు పుట్టాయి. దక్షిణభారత శాస్త్రీయ సంగీతానికి అవే పునాదులు. రామభక్తి వల్లే కంచర్ల గోపన్న శ్రీరామదాసుగా మారి, భజన కీర్తలను భావితరాలకు అందించారు. వేదవ్యాస లిఖితమైన శ్రీమద్భాగవతాన్ని బమ్మెరపోతన తెలుగీకరించారంటే ఆయనకు ఆ శక్తిని ఇచ్చింది రామభక్తే. రాముడు కేవలం ఒక మతానికి ప్రతినిధి కాదు, సంస్కృతినీ, సాహిత్యాన్నీ, కళలనూ, ప్రభావితం చేసిన కళాదీప్తి.
ఇక సకలకళల సమ్మేళనమైన సినిమాపై రాముడి ప్రభావం సామాన్యమైనది కాదు. అసలు ‘హీరోయిజం’ పుట్టిందే రాముడి నుంచి. ఎలివేషన్స్ క్రియేటయ్యిందే రామాయణం నుండి. ‘మారీచ ఉవాచ’ చదివినవారికి ‘హీరో ఎలివేషన్’ అంటే ఏంటో అర్థమవుతుంది. ‘కేజీఎఫ్’ నుండి వెండితెరపై ఎలివేషన్స్ ట్రెండ్ మొదలైంది. స్టార్ హీరో అంటే ఇప్పుడు ఎలివేషన్స్ పక్కా. వాటన్నింటికీ రామాయణ కావ్యంలో రాముడి పాత్రపై వాల్మీకి ఇచ్చిన ఎలివేషన్సే స్ఫూర్తి. రాముడి ప్రేరణగా వెండితెరపై నేటికీ హీరోలు పుడుతూనే వున్నారు.. పుడుతూనేవుంటారు.
ఇక రామాయణం ప్రేరణగా వచ్చిన సినిమాలైతే కోకొల్లలు. ‘బాలనాగమ్మ’ అనే చందమామ కథ తెలుగులో మూడుసార్లు నిర్మితమైంది. ఈ కథకు ప్రేరణ రామాయణం. దర్శకుడు బాపూ అయితే రామాయణం ప్రేరణగా ముత్యాలముగ్గు, గోరంతదీపం, కలియుగ రావణాసుడు చిత్రాలను తీశారు. సంపూర్ణ రామాయణం, సీతాకల్యాణం, శ్రీరామరాజ్యం చిత్రాలతో వాల్మీకి రామాయణాన్నీ, ఉత్తర రామాయణాన్నీ సంపూర్ణంగా తెరకెక్కించిన బాపూ.. ‘శ్రీరామాంజనేయయుద్ధం’ చిత్రంతో కల్పిత రామాయణాన్ని కూడా తీసి, దర్శకుడిగా ధన్యుడయ్యారు.
వెండితెరపై రామకథలు అనగానే ఠపీమని గుర్తొచ్చే సినిమాలు ఎన్టీయార్ ‘లవకుశ’, ‘సీతారామకల్యాణం’. శ్రీరామనవమి వచ్చిందంటే పందిళ్లలో వినిపించేవి ఈ రెండు సినిమాల్లోని పాటలే. ‘శ్రీ సీతారాముల కల్యాణం చూతమురారండీ..’ అంటూ.. ‘వినుడు వినుడు రామాయణగాధ వినుడీ మనసారా..’ అంటూ నవమి పందిళ్లు రామనామంతో మారుమోగిపోతూ ఉంటాయి.
రామచంద్రమూర్తిగా ఎక్కువ సినిమాల్లో నటించిన క్రెడిట్ మాత్రం మహానటుడు నందమూరి తారక రామారావుదే. సంపూర్ణ రామాయణం(1958), లవకుశ(1963), శ్రీకృష్ణసత్య(1971), శ్రీకృష్ణాంజనేయయుద్ధం(1972), శ్రీరామపట్టాభిషేకం(1978) ఎన్టీయార్ శ్రీరాముడిగా నటించిన సినిమాలు. ఎన్టీయార్ తర్వాత రాముడిగా మెప్పించిన హీరోలుగా హరనాథ్, శోభన్‌బాబులను చెప్పుకోవాలి. ఎన్టీయార్ ‘సీతారామకల్యాణం’ సినిమాలో హరనాథ్ తొలిసారి రాముడిగా కనిపించారు. ఆ తర్వాత ‘రామకథ’ అనే సినిమాలో కూడా రాముడిగా నటించారు. బాపు ‘సంపూర్ణ రామాయణం’లో శోభన్‌బాబు రాముడిగా మెరిసి, మెప్పించారు.
అక్కినేని నాగేశ్వరావు హీరోగా నటించిన తొలి సినిమా ‘సీతారామజననం’. అందులో ఆయన నటించింది శ్రీరాముడి పాత్రే. కాంతారావు కూడా వీరాంజనేయ, పాదుకా పట్టాభిషేకం చిత్రాల్లో రాముడిగా నటించారు. అలాగే అక్కినేని నాగార్జున ‘శ్రీరామదాసు’ చిత్రంలో సుమన్ రాముడిగా ఒదిగిపోయారు. ‘శ్రీరామరాజ్యం’లో రాముడిగా నటించి, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు బాలకృష్ణ.
ఇక తారక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 1996లో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ‘రామాయణం’లో ఆయన రాముడిగా నటించారు. అప్పుడు తారక్ వయసు కేవలం 13ఏళ్లు. అంత చిన్నవయసులో కళ్యాణరాముడిగా తారక్ అభినయం తాతను గుర్తు చేసింది.
చివరిగా చెప్పొచ్చేదేంటంటే.. ఎంత చెప్పుకున్న తరగని ముచ్చట ఇది. నిజం చెప్పాలంటే ఓ పుస్తకమే రాయొచ్చు. అందుకే మచ్చుకి కాసేపు కళారామ స్మరణ.. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అన్నమాట.