Fauzi | రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా వచ్చిన ది రాజా సాబ్ చిత్రంతో ప్రేక్షకులను అలరించినప్పటికీ, ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఈ ఏడాదిలోనే ఒక భారీ హిట్‌తో తిరిగి ఫామ్‌లోకి రావాలని ప్రభాస్ పట్టుదలగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నఫౌజీ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంతో రూపొందుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే సినిమా మెజారిటీ షూటింగ్ పూర్తవ్వగా, మిగిలిన భాగాలను వేగంగా పూర్తి చేయడానికి చిత్రబృందం కృషి చేస్తోంది.
మొదట ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేసినప్పటికీ, నిర్మాణ పనుల ఆలస్యం కారణంగా విడుదల డిసెంబర్‌కు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. అయితే, ఈ ఆలస్యం ఎక్కువ కాకుండా ఉండేందుకు చిత్ర యూనిట్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.ప్రస్తుతం ఒకవైపు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను దర్శకుడు హను రాఘవపూడి స్వయంగా తెరకెక్కిస్తుండగా, మరోవైపు ‘సెకండ్ యూనిట్’ భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌ను చిత్రీకరిస్తోంది. ఈ విధంగా రెండు బృందాలు సమాంతరంగా పని చేయడం ద్వారా సమయాన్ని ఆదా చేస్తూ షూటింగ్‌ను త్వరగా పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతున్నారు.
క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత ప్రమాణాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ లుక్, హను రాఘవపూడి ప్రత్యేకమైన మేకింగ్ స్టైల్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. తాజా సమాచారం ప్రకారం, అన్ని పనులు అనుకున్న విధంగా పూర్తైతే ఈ ఏడాది చివర్లో అంటే డిసెంబర్లోనే ఫౌజీ ప్రేక్షకుల ముందుకు రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే అధికారిక విడుదల తేదీని ప్రకటించే అవకాశముందని సమాచారం. సీతారామం వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు హను రాఘవపూడి నుంచి వస్తున్న ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.